అరకు ఉత్సవ్ అదిరే!
ABN , First Publish Date - 2020-03-02T10:08:25+05:30 IST
అరకు ఉత్సవ్ ఆదివారం ఘనంగా ముగిసింది. తొలిరోజు కంటే రెండో రోజు భారీగా జనం తరలి రావడంతో జాతర వాతావరణాన్ని తలపించింది. సాయంత్రం అయ్యేసరికి ఎన్టీఆర్ గ్రౌండ్ నిండిపోయింది. ఐదు గంటలకు ప్రారంభమైన ఈ వేడుక

- రెండో రోజు జాతరను తలపించిన వేదిక ప్రాంగణం
- భారీగా తరలి రాక
- అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
- ఆట పాటలతో ఔరా.. అనిపించిన విద్యార్థులు
- జానపద గీతాలతో జోష్‌పుట్టించిన గాయని మంగ్లీ
- ముగింపోత్సవం సందర్భంగా నిర్వాహకులకు ఘన సన్మానం
అరకులోయ: అరకు ఉత్సవ్ ఆదివారం ఘనంగా ముగిసింది. తొలిరోజు కంటే రెండో రోజు భారీగా జనం తరలి రావడంతో జాతర వాతావరణాన్ని తలపించింది. సాయంత్రం అయ్యేసరికి ఎన్టీఆర్ గ్రౌండ్ నిండిపోయింది. ఐదు గంటలకు ప్రారంభమైన ఈ వేడుక ఆద్యంతం ఆటకట్టుకుంది. గిరిజన సంక్షేమశాఖ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలల విద్యార్థినుల నృత్యాలు కనువిందు చేశాయి. కొత్తభల్లుగుడ బాలికల ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థుల జానపద నృత్యం, విశాఖపట్నం స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ బాలికల రేలారే.. రేలారే.. నృత్యాలు, అనంతగిరి బాలికల-1, బాలికలు-2 విద్యార్థినుల రాజస్థాన్ నృత్యాలు కేకపుట్టించాయి. వందేమాతరం గీతానికి చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే విధంగా గన్నెల బాలికల ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థులు ‘ఘల్లు..ఘల్లుమనే..’ పాటకు అద్భుతంగా నాట్యం చేశారు. అరకులోయ కేజీబీవీ పాఠశాల విద్యార్థులు కోలాటం ఆడారు. అంతే కాకుండా బస్తర్ కొమ్ముకోయ నృత్యాలు అదరహో అనిపించాయి. విజయవాడకు చెందిన సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థుల ఫోక్ ఆర్కెస్ట్రా ఉర్రూతలూగించింది. ఇక ఫైర్ విన్యాసాలు ప్రశంసలు అందుకున్నాయి. అరకులోయకు చెందిన ప్రకాష్ అరకు విశిష్టతలు, ప్రకృతి అందాలతో పాటు పర్యాటక ప్రాంతాలపై చక్కగా గీతాలాపన చేశారు. ఇందుకు మంత్రముగ్ధులైన ఐటీడీఏ పీవో డీకే బాలాజీ ఆయనను అభినందనలతో ముంచెత్తారు. అనంతరం సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్‌తో కలిసి దుశ్శాలువతో సత్కరించారు.
అధికారులకు సన్మానం
ఉత్సవ్‌ను విజయవంతం చేసిన వివిధ శాఖల అధికారులను అరకు ఎంపీ మాధవితో పాటు ఐటీడీఏ పీవో, సబ్‌కలెక్టర్, ఎమ్మెల్యేలు ఫాల్గుణ, భాగ్యలక్ష్మిలు మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు.
క్రీడా విజేతలకు బహుమతులు
ఇదిలావుంటే, ఉత్సవ్ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించారు. వాలీబాల్, రంగవల్లులు, ఆర్చరీ తదితరాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
సందడి చేసిన ‘ఒరేయ్ బుజ్జి’ యూనిట్
ఈ ఉత్సవ్‌లో ‘ఒరేయ్ బుజ్జి’ సినిమా ప్రమోషన్‌కు వేదికైంది. హీరో రాజ్‌తరుణ్, హీరోయిన్ మాళివికలు కాసేపు సందడి చేశారు. ఉగాది రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అలరించిన మంగ్లీ పాటలు
స్వరం కలిపి, స్టెప్పులేని ఎమ్మెల్యేలు, ఎంపీ
అరకు ఉత్సవ్ ముగింపు సందర్భంగా ఏర్పాటైన మంగ్లీ పాటలు అందరిలో జోష్‌పుట్టించాయి. తొలుత జగన్‌కు సంబంధించిన ‘గిరగిర తిరుగుతున్న ఫ్యాన్’ పాటను పాడుతుండగా పాడేరు, అరకు ఎమ్మెల్యేలు, అరకు ఏంపీ స్టెప్పులేసి, స్వరం కలుపుతూ సందడి చేశారు. మంగ్లీ అరకులోయ అందాలను వివరిస్తూ పాడిన పట విశేషంగా ఆకట్టుకుంది.