కొద్దిగా వెనక్కి....

ABN , First Publish Date - 2020-07-18T10:07:33+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నది. కరోనా వైరస్‌ లక్షణాలు వున్న వారందరికీ టెస్టులు చేయడం ..

కొద్దిగా వెనక్కి....

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

తాజాగా మరో 32 మందికి వైరస్‌

గత మూడు రోజుల నుంచి రెండంకెల్లోనే పాజిటివ్‌లు

జిల్లాలో 2,562లకు చేరిన కొవిడ్‌ కేసులు

వైరస్‌ బారినపడిన వారిలో 1,644 మంది డిశ్చార్జ్‌

వివిధ ఆస్పత్రుల్లో 871 మందికి చికిత్స  

బాధితుల్లో మరొకరు మృతి.... 47కు చేరి మరణాలు


విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నది. కరోనా వైరస్‌ లక్షణాలు వున్న వారందరికీ టెస్టులు చేయడం లేదా? కిట్లు కొరత వుందా? వైరస్‌ తగ్గుముఖం పట్టిందా? కారణాలు ఏమైనప్పటికీ నాలుగు రోజుల క్రితంతో పోలిస్తే పాజిటివ్‌ కేసులు బాగా తగ్గాయి. శుక్రవారం జిలాల్లో 32 మంది వైరస్‌బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెలలో ఇప్పటి వరకు ఒక రోజు నమోదైన కేసుల్లో ఇవే అతి తక్కువ. జూలైలో ఇంతవరకు సగం రోజులు... నిత్యం వంద మందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు. కాగా శుక్రవారం నమోదైన కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2,562కు చేరింది. ఇప్పటి వరకు వైరస్‌ బారినపడిన వారిలో 1,644 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 871 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మరొకరు మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 47కు చేరింది. 


మల్కాపురం ప్రాంతంలో ముగ్గురికి.... 

మల్కాపురం షిప్‌యార్డు కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కరోనా వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 58 ఏళ్ల వ్యక్తి, 26 ఏళ్ల మహిళ ఉన్నారు. వైరస్‌ బారిన పడిన ప్రాంతం నేవీ ఆధీనంలో వుంది. కాగా జనతాకాలనీలో 60 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  


ఆరిలోవలో రెండు... 

ఆరిలోవ ప్రాంతంలో తాజాగా మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పైనాపిల్‌కాలనీలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో 24 ఏళ్ల యువతి, పెదగదిలి శివాలయం సమీపంలో వుంటున్న 26 ఏళ్ల యువకుడికి వైరస్‌ నిర్ధారణ అయింది. 


బర్మాకాలనీలో రెండు కేసులు 

మురళీనగర్‌ అయ్యప్పనగర్‌లో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. డీఐజీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌(50)తోపాటు మరో 37 ఏళ్ల వ్యక్తి వైరస్‌ బారిన పడినట్టు నిర్ధారించారు. 


పద్మనాభం మండలం బీఆర్‌తాళ్లవలస పంచాయతీ బొత్సపేటలో కరోనా పా జిటివ్‌ కేసు నమోదైంది. ఈ గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌ నుంచి ఈ నెల రెండో తేదీన వచ్చి, విజయనగరంలో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. ఈ సందర్భంగా తన అత్తవారి ఊరు డెంకాడ చిరునామా ఇచ్చాడు. తరువాత పాజిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో అధికారులు అప్రమత్తమై డెంకాడలోని కుటుంబ సభ్యులను హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచారు. బాధితుడు బొత్సపేటలో వున్నట్టు తెలుసుకుని, ఇప్పటికే 14 రోజులు గడిచిపోయినందున హోమ్‌ క్వారంటైన్‌లో వుంచి చికిత్స అందిస్తున్నారు.  


వేపగుంట పరిధిలోని గోశాల దరి షిప్‌యార్డ్‌ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్‌ టెక్నీషియన్‌(45)కు పాజిటివ్‌ వచ్చింది. 


అక్కిరెడ్డిపాలెంలో మరో యువకుడు కరోనా బారిన పడ్డాడు. నాలుగు రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఇతను కొవిడ్‌ పరీక్షలు పరీక్షలు చేయించుకోగా శుక్రవారం పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది.


సీతమ్మధార పరిధి నక్కవానిపాలెం నుంచి చైతన్యనగర్‌కు వెళ్లే దారిలో వినాయక ఆలయం సమీపంలో నివసిస్తున్న ఒక వ్యక్తికి కరోనా సోకింది. రెండు రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఐదు కేసులు బయటపడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-07-18T10:07:33+05:30 IST