కరోనా పరీక్షలు విస్తృతంగా పెంచాలి

ABN , First Publish Date - 2020-07-28T10:05:33+05:30 IST

కరోనా పరీక్షలను విస్తృతంగా పెంచాలని, కొవిడ్‌ ఆసుపత్రులలో, క్వారెంటైన్‌ కేంద్రాల్లో వసతులు మెరుగుపరచాలని సీపీఎం ..

కరోనా పరీక్షలు విస్తృతంగా పెంచాలి

వామపక్షాల డిమాండ్‌


ఆశీల్‌మెట్ట, జూలై 27: కరోనా పరీక్షలను విస్తృతంగా పెంచాలని, కొవిడ్‌ ఆసుపత్రులలో,  క్వారెంటైన్‌ కేంద్రాల్లో వసతులు మెరుగుపరచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ నరసింగరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. కరోనా నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆఽధ్వర్యంలో సోమవారం జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీహెచ్‌.నరసింగరావు, జేవీ సత్యనారాయణ మూర్తిలు మాట్లాడుతూ విమ్స్‌లో 500 పడకలు ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్‌ ఆసుపత్రులలో తగిన వసతులు లేక, వెంటిలేటర్స్‌ లేక బాధితులు మృత్యువాత పడుతున్నారన్నారు. ఎక్స్‌రే, ఈసీజీ వంటివి కూడా సరైన సమయంలో తీయటం లేదన్నారు.


కొవిడ్‌ బాధితులు నిరసనలు, సోషల్‌ మీడియాలో ఆవేదనలు వ్యక్తం చేస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. విశాఖలో కరోనా పరీక్షల కేంద్రాలు పెంచాలని, బెడ్స్‌ సంఖ్య పెంచాలని, వైద్య, ఆరోగ్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలు, పారిశుధ్యం, అంగన్‌వాడీలకు మాస్కులు, శానిటైజర్లు, ఇతర పరికరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు కొండయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాఽథం, వెంకటేశ్వరరావు, వి.కృష్ణారావు, పి.మణి, సీపీఐ నాయకులు వామనమూర్తి, రెహమాన్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-28T10:05:33+05:30 IST