జంతు ప్రదర్శనశాలపై కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2020-08-11T09:48:58+05:30 IST

కరోనా ప్రభావం నగరంలోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కు(జూ)పై తీవ్రంగా పడింది.

జంతు ప్రదర్శనశాలపై కరోనా ప్రభావం

మార్చి నుంచి సందర్శకులకు ప్రవేశం నిలిపివేత

రూ.1.25 కోట్ల ఆదాయానికి గండి

భారంగా మారిన నిర్వహణ

నెలకు సగటున రూ.55 లక్షలు అవసరం

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, దాతల సాయమే ఆధారం 

మొత్తం జంతువులు, పక్షులు 800

మొత్తం సిబ్బంది 149

గత ఏడాది మార్చి-జూలై వరకూ 

సందర్శకులు 4,00,000

టిక్కెట్ల ద్వారా రూ.2 కోట్లు వచ్చిన ఆదాయం (సుమారు)


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం నగరంలోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కు(జూ)పై తీవ్రంగా పడింది. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి జూలోకి సందర్శకులను అనుమతించడం ఆపేశారు. దీంతో ఆదాయానికి గండిపడింది. ఈ నేపథ్యంలో జూపార్కు నిర్వహణ కూడా ప్రస్తుతం భారంగా మారింది.


కంబాల కొండ రిజర్వు ఫారెస్టు ప్రాంతం లోని 625 ఎకరాల్లో విస్తరించి వున్న ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల రాష్ట్రంలోనే అతి పెద్దదిగా గుర్తింపుపొందింది. జూలో క్రూరమృ గాలు, వన్యప్రాణులు, ఇతర జంతువులన్నీ కలిపి 800కిపైగా ఉన్నాయి. నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు, నగరానికి వచ్చే పర్యాటకులు జూను సంద ర్శిస్తుంటారు. ఆదివారం, పండుగ రోజులు, సెలవు దినాల్లో అయితే పోటెత్తుతుంటారు. సాధారణంగా మార్చి నుంచి జూలై వరకూ జూపార్కుకు సందర్శకులు ఎక్కువగా వస్తుం టారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకూ 8,11,989 మంది జూను సందర్శించగా టిక్కెట్ల ద్వారా రూ.4,12,27,910 ఆదాయం వచ్చింది. ఇదికాకుండా ఆ ఏడాది టెండర్లు, లీజుల ద్వారా మరో రూ.71 లక్షలు ఆదాయం సమకూరింది. అందులో నాలుగు లక్షల మంది వరకూ ఏప్రిల్‌ నుంచి జూలై మధ్యలో సందర్శించినవారే కావడం విశేషం. అలాగే ఏడాది మొత్తంలో వచ్చిన ఆదాయంలో సగం ఈ నాలుగు నెలల్లోనే వస్తుండడం గమనార్హం. అయితే ఈ ఏడాది కరోనా విజృంభణ నేపథ్యంలో మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో జూపార్కులోకి సందర్శకులను అనుమతించడం నిలిపివేశారు. ఇప్పటికీ సందర్శకులను అనుమతించకపోవడంతో ఆదాయం పూర్తిగా కోల్పోవాల్సిన పరిసితి ఏర్పడింది.


నిర్వహణకు నెలకు సగటున రూ.55 లక్షలు వ్యయం

జూపార్కులో జంతువులకు ఆహారం, మందులు, సిబ్బంది వేతనం, క్రిమిసంహారక మందుల స్ర్పేయింగ్‌ వంటి వాటికి నెలకు రూ.55 లక్షలు వరకూ ఖర్చు అవుతోంది. అయితే ప్రస్తుతం ఆదాయం లేకపోవడంతో ఖర్చుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్కీముల కింద ఇచ్చే నిధులతోపాటు జంతుప్రేమికులు జంతువుల దత్తత ద్వారా అందించే స్వల్ప మొత్తాలతోనే నెట్టుకురావాల్సిన పరిసితి నెలకొంది. అలాగే గతంలో టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నారు.


జంతువుల దత్తతకు మందుకురావాలి.. నందిని సహారియా, జూ క్యురేటర్‌

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జంతు వులను దత్తత తీసుకునేందుకు జంతు ప్రేమికులు ముందుకురావాలి. అందుకోసం ఆన్‌లైన్‌ లో ఫ్లాట్‌ఫారం ఏర్పాటుచేశాం. ఇప్పుడిప్పుడే కొంతమంది చిన్న జంతువులను దత్తత తీసుకోవడం ప్రారంభించారు. మరింతమంది ముందుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే నగరంలో కార్పొరేట్‌ సంస్థలు, పరిశ్రమలు సీఎస్‌ఆర్‌ పథకం కింద జూ అభివృద్ధికి, నిర్వహణకు నిధులు కేటాయిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. కరోనా నేపథ్యంలో గత ఆరు నెలల్లో రూ.1.25 కోట్లు ఆదాయం కోల్పోయినట్టు అంచనా వేస్తున్నాం.

Updated Date - 2020-08-11T09:48:58+05:30 IST