-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Carona cases count in Visakhapatnam
-
విశాఖలో కరోనా బుసలు... ఒక్కరోజే ఏకంగా...
ABN , First Publish Date - 2020-06-22T15:42:02+05:30 IST
జిల్లాలో కరోనా మహమ్మారి బుసలు కొడుతున్నది. వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.

విజృంభిస్తున్న వైరస్ మహమ్మారి
ఒక్క రోజే 35 కేసులు నమోదు
ఇప్పటి వరకు జిల్లాలో ఇదే రికార్డు
వైరస్‌కు అడ్డాగా మారిన అప్పుఘర్ ప్రాంతం
మరో 14 మందికి పాజిటివ్ నిర్ధారణ
మొత్తం 55 మంది బాధితులు
జిల్లాలో 443కి చేరిన పాజిటివ్ కేసులు
వైరస్ బారినపడి మరొకరి మృతి
జిల్లాలో మూడుకు చేరిన మరణాలు
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మహమ్మారి బుసలు కొడుతున్నది. వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆదివారం 35 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో 14 మంది నగరంలోని అప్పుఘర్ ప్రాంతానికి చెందినవారు కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వీరితో కలిపి ఇక్కడ 55 మంది వైరస్ బారిన పడ్డారు. జిల్లాలో మరే ప్రాంతంలోనూ ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాలేదు.
దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యలపై దృష్టి సారించారు. అనకాపల్లిలో 41 ఏళ్ల తండ్రి, ఏడేళ్ల కుమార్తె కరోనా వైరస్‌బారిన పడ్డారు. కాగా శుక్రవారం నమోదైన 29 కేసులే ఇప్పటి వరకు రికార్డ్‌కాగా, ఆదివారం 35 కేసులతో కొత్త రికార్డు నమోదైంది. ఇదిలావుండగా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరొకరు మృతిచెందారు. దీంతో జిల్లాలో కొవిడ్ మరణాల సంఖ్య మూడుకు చేరింది.
అప్పుఘర్‌పై కరోనా పంజా
విశాఖ నగరంలోని అప్పుఘర్ ప్రాంతంపై కరోనా వైరస్ పడగవిప్పి బుసలు కొడుతున్నది. ఈ ప్రాంతంలో రోజూ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే 41 మంది వైరస్‌బారిన పడగా, ఆదివారం మరో 14 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో వైరస్‌బారిన పడినవారి సంఖ్య 55కు చేరింది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో ఈ ప్రాంతంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాస్ర్తి, జడ్సీ శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ జయరామ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ త్రినాథరావు, తదితరులు ఈ ప్రాంతాన్ని సందర్శించి స్థానికులకు పలు సూచనలు చేశారు. వీఽధుల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
అనకాపల్లిలో తండ్రి, కుమార్తెకు వైరస్
అనకాపల్లి ఉడ్‌పేట ప్రాంతంలో తండ్రి(41)తోపాటు ఏడేళ్ల కుమార్తె కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇతను రైల్వే శాఖలో అనకాపల్లి సమీపంలోని ఒక స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన కుటుంబంతో సహా హౌరా నుంచి అనకాపల్లి వచ్చారు. శనివారం ఎన్టీఆర్ వైద్యాలయంలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తండ్రి, కుమార్తెకు పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టు ఆదివారం వెల్లడించారు. వీరిని వెంటనే విశాఖ తరలించారు. బిహార్‌కు చెందిన ఈ కుటుంబంలో మరో ఇద్దరికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆదివారం నమోదైన కేసులతో కలిపి అనకాపల్లి ప్రాంతంలో ఇప్పటి వరకు 49 మంది కరోనా వైరస్‌బారిన పడ్డారు. కాగా ఉడ్‌పేట నుంచి నాగవంశం వీధి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు.
సాయిరామ్‌నగర్‌లో 17 ఏళ్ల అమ్మాయికి
జీవీఎంసీ 49వ వార్డు సాయిరామ్‌నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయికి వైరస్ సోకింది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఈమెను తల్లిదండ్రులు ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైరస్ అనుమానిత లక్షణాలు వుండడంతో కొవిడ్ పరీక్ష చేయించాలని వైద్యులు సూచించారు. కరోనా పరీక్ష నిర్వహించగా ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమ్తతమైన అధికారులు ఈ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.
ఆరిలోవలో మరొకరికి...
ఆరిలోవ ప్రాంతం రవీంద్రనగర్‌కు చెందిన 37 ఏళ్ల వ్యక్తికి ఆదివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గాయత్రి ఆస్పత్రికి తరలించారు. ఇతను ప్రజా రవాణా శాఖ(పీటీడీ) డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి కొవిడ్ బాధితులను తరలించే అంబులెన్స్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వైరస్ బారినపడినట్టు భావిస్తున్నారు. దీంతో ఆరిలోవలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకి చేరింది.
దండుబజార్ ప్రాంతంలో..
దండుబజారు సమీపంలో భుజంగరావుపేటకు చెందిన వ్యక్తి(45)కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతను ఇటీవల విజయవాడ వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతుండడంతో నగరంలోని ఛాతి ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆదివారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇద్దరు సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగులకు పాజిటివ్
విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఐఎస్‌ఎఫ్ యూనిట్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సమాచారం. యూనిట్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌లు ఇటీవల చెన్నై హైకోర్టుకు భద్రత విధులు నిమిత్తం డిప్యూటేషన్‌పై వెళ్లారు. విధులు ముగించుకొని రోడ్డు మార్గాన విశాఖ చేరుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. ఇంకా నగర పరిధిలోని ఆదర్శ్‌నగర్‌లో ఇద్దరు, ఓల్డ్ డెయిరీ ఫారం ప్రాంతంలో ఇద్దరు, ముస్లింతాటిచెట్లపాలెంలో ఒకరు, దొండపర్తిలో ఒకరు, బాలాజీనగర్‌లో ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు.
మరొకరు మృతి..
కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరొకరు ఆదివారం మృతి చెందారు. అయితే ఇతను ఏ ప్రాంతానికి చెందినవారో అధికారులు వెల్లడించాల్సి వుంది. కాగా జిల్లాలో కొవిడ్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.