కారిడార్‌లో రసాయన పరిశ్రమలపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోండి

ABN , First Publish Date - 2020-11-20T04:42:39+05:30 IST

నక్కపల్లి మండలంలో విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం సేకరించిన భూముల్లో నెలకొల్పే రసాయన, పెట్రో రసాయన పరిశ్రమలకు సంబంధించి ఈ నెల 25న ఏపీఐఐసీ నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలందరూ అడ్డుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు

కారిడార్‌లో రసాయన పరిశ్రమలపై  ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోండి
కారిడార్‌ భూములను పరిశీలిస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం


సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపు


నక్కపల్లి, నవంబరు 19: నక్కపల్లి మండలంలో విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం సేకరించిన భూముల్లో నెలకొల్పే రసాయన, పెట్రో రసాయన పరిశ్రమలకు సంబంధించి ఈ నెల 25న ఏపీఐఐసీ నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలందరూ అడ్డుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని పాటిమీద, రాజయ్యపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనంతరం రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, సేకరించిన 3,899 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు సంబంధించి ఒకేసారి ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పైగా ప్రజాభిప్రాయ సేకరణ సభకు వారం రోజులు కూడా గడువు లేని,  అంతేకాక ఆయా గ్రామాల్లో పర్యావరణ ప్రభావిత నివేదికలను అందుబాటులో ఉంచలేదని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో  నిషేధించిన ఫార్మా, రసాయన కంపెనీలను నక్కపల్లి మండలంలో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. విశాఖ జిల్లా ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకుందని, కేంద్ర పర్యావరణ విభాగం, పర్యావరణ వేత్తల అంచనా ప్రకారం విశాఖ జిల్లా రెడ్‌ జోన్‌లో వుందన్నారు. ఇటీవల పలు రసాయన కంపెనీల్లో జరిగిన ప్రమాదాల గురించి ఆయన వివరించారు. ఈ కారణాల వల్ల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకుడు ఎం.అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, మండల కన్వీనర్‌ ఎం.రాజేశ్‌, పి.నల్ల, పిక్కి తాతీలు, ఆర్‌.నరసింగరావు, ఆర్‌.అప్పారావు, ఎం.జాన్‌, ఎం.ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-20T04:42:39+05:30 IST