ఇసుక డోర్‌ డెలివరీకి స్వస్తి?

ABN , First Publish Date - 2020-09-24T09:44:25+05:30 IST

గడచిన ఏడాదిగా అమలులో వున్న ఇసుక విధానాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూపొందించిన ఈ విధానంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.

ఇసుక డోర్‌ డెలివరీకి స్వస్తి?

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న తరువాత వినియోగదారుడే డిపో వద్దకు వెళ్లి తెచ్చుకోవాలి

అక్కడే అందుబాటులో లారీలు

కిలోమీటరుకు ఇంత...అనే రేటు ఖరారు చేయనున్న ప్రభుత్వం

ధర కూడా తగ్గించే యోచన   8 జిల్లాలో డిపోల కుదింపు

అచ్యుతాపురం, నక్కపల్లి డిపోలు ఎత్తివేత?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):

గడచిన ఏడాదిగా అమలులో వున్న ఇసుక విధానాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూపొందించిన ఈ విధానంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విధానాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించనున్నట్టు తెలిసింది. వినియోగదారుల ఇంటికే ఇసుక సరఫరా అనే విధానాన్ని ఇకపై రద్దు చేయనున్నది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వినియోగదారుడు నేరుగా డిపోకు వెళ్లి ఇసుక తీసుకువెళ్లాల్సి ఉంటుంది.


త్వరలో దీనికి సంబంధించి విధి విధానాలు విడుదల చేయనున్నది. గత ఏడాది రూపొందించిన విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వినియోగదారుడికి ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేయాలి. అయితే ఇందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇసుక కోసం ఒక్కొక్కసారి వినియోగదారుడు నేరుగా సమీపంలో వున్న డిపోకు వెళ్లినా అక్కడ సిబ్బంది సరఫరా విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. తృణమోఫణమే సమర్పించుకుంటే తప్ప ఇసుక పంపడం లేదు.


అందువల్ల ప్రస్తుతం వున్న డోర్‌ డెలివరీ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో వినియోగదారుడు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న తరువాత నేరుగా డిపోకు వెళ్లి ఇసుక తెచ్చుకునేలా కొత్త విధానం తీసుకురానున్నారు. అయితే డిపోల వద్ద లారీ యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరించకుండా కిలోమీటరుకు ఇంత...అని రేటు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రీచ్‌ల వద్ద టన్నుకు రూ.375 వసూలు చేస్తున్నారు.


కాగా గనుల శాఖ రీచ్‌ల నుంచి డిపోలకు ఇసుక తరలించి అక్కడ నుంచి టన్నుకు రూ.1500తోపాటు రవాణా చార్జీలు వసూలుచేస్తోంది. అదే గోదావరి ఇసుక అయితే మరింత రేటు పెట్టాల్సి వస్తోంది. గత ఏడాది నుంచి అమలులో వున్న ఈ ధరపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత  వస్తోంది. సామాన్యులకు ఇసుక రేటు అందుబాటులో లేదని అధికార పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఏడాది నుంచి ఇసుక విక్రయాలు చేస్తున్న గనుల శాఖలో కూడా రేటుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.


వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ధర తగ్గించనున్నారు. అయితే ధర ఏ మేరకు తగ్గించాలి? అనేది ఈ వారంలో తేలనున్నది. కాగా అన్ని జిల్లాల మాదిరిగా విశాఖ జిల్లాలో డిపోల సంఖ్యను కుదించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం భీమిలి, ముడసర్లోవ, అగనంపూడి, అనకాపల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, నర్సీపట్నం, చోడవరంలలో డిపోలు వుండగా వీటిలో రెండు నుంచి నాలుగు డిపోలు ఎత్తివేసే అవకాశం ఉంది.  


అగనంపూడి, అనకాపల్లి, అచ్యుతాపురం డిపోల మధ్య దూరం తక్కువగా ఉంది. ఈ మూడింటిలో ఒకటి లేదా రెండు ఎత్తివేసే అవకాశం ఉంది. నర్సీపట్నం, చోడవరం డిపోలు అవసరమైనవిగా గుర్తించినట్టు తెలిసింది. అలాగే నక్కపల్లిలో డిపో ఎత్తివేసి ఎలమంచిలిలో ఏర్పాటుచేస్తే మంచిదని యోచిస్తున్నారు. అటువంటప్పుడు అచ్యుతాపురం ఎత్తివేసే అవకాశం ఉంది. కాగా రీచ్‌ల వద్ద కూడా ఇసుక సరఫరాలో ఇబ్బందులు పరిష్కరించాలని నిర్ణయించారు.


శ్రీకాకుళం జిల్లాలో రీచ్‌ల వద్ద అధికార పార్టీ నేతలు బహిరంగంగానే ఇసుక విక్రయాలు చేపట్టడంతో ప్రభుత్వానికి తీవ్ర అప్రతిష్ట తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో రీచ్‌ల వద్ద అనధికార వ్యక్తులను దూరంపెట్టి అధికారుల సమక్షంలో ఇసుక సరఫరా చేసేందుకు ఏర్పాట్లుచేయనున్నారు. కాగా పాత విధానం పునఃసమీక్షించిన అనంతరం కొత్త విధానం అమలులోకి రానున్నదని గనుల శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2020-09-24T09:44:25+05:30 IST