లోపాలను ఇట్టే పట్టేస్తుంది

ABN , First Publish Date - 2020-12-05T06:02:17+05:30 IST

భూగర్భ కేబుల్‌ వ్యవస్థలో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే ఏమి చేస్తారు?...లోపం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ తవ్వుకుంటూ పోతారు.

లోపాలను ఇట్టే పట్టేస్తుంది
భూగర్భంలో కేబుల్‌ లోపాలను గుర్తించే లొకేటర్‌ వాహనం

రూ.3 కోట్లతో జర్మనీ నుంచి కొనుగోలు

ప్రభుత్వ రంగంలో ఇదే మొదటిది...

ఇతర సంస్థలకూ ఉపయోగం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భూగర్భ కేబుల్‌ వ్యవస్థలో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే ఏమి చేస్తారు?...లోపం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ తవ్వుకుంటూ పోతారు. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అయితే కచ్చితంగా సమస్య ఎక్కడుందో గుర్తించడానికి ఓ అధునాతన పరికరం అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) దానిని సమకూర్చుకుంది. పేరు...‘అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ ఫాల్ట్‌ లొకేటర్‌.’ దీని ఖరీదు రూ.3 కోట్లు. జర్మనీ నుంచి తెప్పించారు.


ప్రయోజనం ఏమిటంటే..?

హుద్‌హుద్‌ తుఫాన్‌ తరువాత తీరంలో విద్యుత్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ప్రపంచ బ్యాంకు నిధులతో అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ పనులు చేపట్టారు. సుమారుగా 1,900 కి.మీ. పొడవున నగరంలో మూడో వంతును కవర్‌ చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.762 కోట్లు వెచ్చిస్తున్నారు. ఎల్‌ అండ్‌ టి, విజయ, జాక్సన్‌ కంపెనీలు ఈ పనులు చేస్తున్నాయి. మార్చి, 2021 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తికావాలి. అన్నీ అయితే దాదాపుగా నగరంలో 80 వేల గృహాలకు అండర్‌ గ్రౌండ్‌ నుంచే విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తారు. ఇప్పటికే పనులు పూర్తయిన పాండురంగాపురం, ఈస్ట్‌పాయింట్‌ కాలనీ వంటి ప్రాంతాల్లో యూజీ కనెక్షన్లు ఇచ్చేశారు. సాధారణంగా బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్‌ వైర్లు తెగిపోయి సరఫరా ఆగిపోతుంది. ఇప్పుడు భూగర్భంలో కేబుళ్లు వుండడం వల్ల అటువంటి సమస్యలు ఉండవు. యూజీ కేబుళ్లకు దాదాపు 99 శాతం సమస్యలు రావు. అయితే...వేరే పనుల కోసం భూగర్భాన్ని ఎవరైనా బలంగా తవ్వితే...ఈ కేబుళ్లు కట్‌ అయిపోతాయి. ఆ విషయాన్ని సంబంధిత వ్యక్తులు చెబితే..ఫరవాలేదు. లేకపోతే సమస్య ఎక్కడుందో తెలియదు. ఇలాంటి వాటిని గుర్తించడానికే ‘కేబుల్‌ ఫాల్ట్‌ లొకేటర్‌’ ఉపయోగపడుతుంది. ఈ వాహనంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, కంప్యూటర్‌ ఉంటాయి. దీనిని ఆపరేట్‌ చేయడానికి ప్రత్యేకంగా ఒక ఏడీఈ, మరో ఇద్దరికి శిక్షణ ఇచ్చారు. ఈ వాహనం నుంచి కేబుల్‌ ద్వారా యూజీ కేబుల్‌కు పల్స్‌ పంపిస్తారు. విద్యుత్‌ వేగంతో అది ప్రయాణించి...లోపం వున్న స్థానానికి వెళ్లి...మళ్లీ అదే వేగంతో వెనక్కి వస్తుంది. ఆ ప్రక్రియ అంతా కంప్యూటర్‌లో కనిపిస్తుంది. సమస్య ఎక్కడుందో దూరంతో సహా కచ్చితంగా చెబుతుంది. దాంతో సూచించిన ప్రాంతంలో తవ్వి పాడైన కేబుల్‌ను కట్‌ చేసి, కొత్త కేబుల్‌ జాయింట్‌ చేసి సరఫరా పునరుద్ధరిస్తారు. సమస్యను పావుగంటలో లొకేషన్‌తో సహా గుర్తించి, మరమ్మతులను మూడు నుంచి నాలుగు గంటల్లో పూర్తిచేస్తారు. ఇలాంటి కేబుల్‌ ఫాల్ట్‌ లొకేటర్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిది. కొన్ని ప్రైవేటు సంస్థలు వీటిని కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నా...ప్రభుత్వ రంగంలో ఇదే మొదటిది కావడం విశేషం. 


అందరికీ ప్రయోజనం

విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అండర్‌ గ్రౌండ్‌ కేబుళ్లు, పైపులు వినియోగిస్తున్నాయి. వాటిలో ఎక్కడైనా సమస్య ఏర్పడితే...తెలుసుకోవడానికి ఇటువంటి వాహనాలను ఒడిశా నుంచి తెప్పిస్తున్నారు. వారు రోజుకు రూ.30 వేలు అద్దెగా వసూలు చేస్తున్నారు. దాంతో పాటు వారికి వసతి, భోజనాలు అదనం. ఇప్పుడు ఈపీడీసీఎల్‌కు దీని పని చాలా తక్కువ. రోజూ దీని అవసరం ఉండదు. ఎప్పుడో గానీ పని పడదు. అందుకని ఖాళీగా వుంచకుండా, రాష్ట్రంలో ఎవరికి దీని అవసరం పడినా అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని యోచిస్తున్నారు. ఒడిశా కంపెనీల కంటే తక్కువ ధరకే ఇవ్వాలని భావిస్తున్నారు.


కచ్చితత్వం ఎక్కువ

- రాజబాపయ్య, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌, ఈపీడీసీఎల్‌

ఈ కేబుల్‌ ఫాల్ట్‌ లొకేటర్‌కు యాక్యురసీ (కచ్చితత్వం) ఎక్కువ. అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కేవలం ఒకటి, రెండు అడుగులు అటుఇటుగా సమస్యను గుర్తిస్తుంది. ఎక్కడికైనా సులువుగా తీసుకువెళ్లిపోవచ్చు. పల్స్‌ పంపించాక, బాంబ్‌ స్క్వాడ్‌లా ఓ పరికరంతో తనిఖీలు చేస్తారు. బీప్‌ శబ్దంతో లొకేషన్‌ చెబుతుంది. ఇతర సంస్థలకు ఇది ఉపయోగపడేలా చేస్తాము.

Updated Date - 2020-12-05T06:02:17+05:30 IST