బీపీఎస్‌కు పదును!

ABN , First Publish Date - 2020-11-19T05:54:49+05:30 IST

అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ (బీపీఎస్‌) అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...అందుకు ముందుకురాని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. బీపీఎస్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొంతమంది ఫీజులు చెల్లించి భవనాలను క్రమబద్ధీకరించుకోరు.

బీపీఎస్‌కు పదును!

స్కీమ్‌లో క్రమద్ధీకరించుకోని అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు

ఆస్తి పన్ను రెండింతలు విధింపు, సదుపాయాలు కూడా కట్‌

విధి విధానాలను రూపొందిస్తున్న మునిసిపల్‌ అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ (బీపీఎస్‌) అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...అందుకు ముందుకురాని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. బీపీఎస్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొంతమంది ఫీజులు చెల్లించి భవనాలను క్రమబద్ధీకరించుకోరు. మరికొంతమంది అతిక్రమణలు వున్నప్పటికీ అసలు దరఖాస్తే చేయరు. అటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) టౌన్‌ప్లానింగ్‌ అధికారులను రాష్ట్ర టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు కోరారు. జీవీఎంసీ పరిధిలో బీపీఎస్‌కు 6,167 దరఖాస్తులు వచ్చాయి.వీటిలో ఇప్పటివరకూ 5,188 దరఖాస్తులను పరిష్కరించగా, 187 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 666 దరఖాస్తులకు సంబంధించి అపరాధ రుసుము వివరాలు తెలియజేయగా...వారి నుంచి ఇంకా స్పందన రాలేదు. మరో 128 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బీపీఎస్‌ ద్వారా జీవీఎంసీకి రూ.73.13 కోట్లు ఆదాయం సమకూరింది. కాగా బీపీఎస్‌కు ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది. కొంతమంది అపరాధ రుసుము చెల్లించాల్సి వుంటుందనే భావనతో దరఖాస్తు చేయడం లేదు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీలు ఆదాయం కోల్పోతున్నాయి. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలకు ఊతం ఇచ్చినట్టవుతోంది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరించుకోని అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఒక ప్రణాళిక రూపొందించి అందజేయాలని టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించింది. అక్కడి అధికారులు రాష్ట్రంలోని మునిసిపల్‌ కార్పొరేషన్‌లలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సీనియర్‌ అధికారుల సలహాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జీవీఎంసీ చీఫ్‌ సిటీప్లానర్‌ ఆర్జే విద్యుల్లత, ఇతర అధికారులతో సంప్రతింపులు జరిపినట్టు తెలిసింది. అక్రమ నిర్మాణాలకు ఇప్పటివరకూ విధిస్తున్న 100 శాతం అదనపు ఆస్తిపన్నును 200 శాతానికి పెంచడంతోపాటు కొళాయి,యూజీడీ కనెక్షన్ల చార్జీలు రెట్టింపు చేయాలని, విద్యుత్‌ కనెక్షన్లను కూడా కఠినతరం చేసేలా ఏపీఈపీడీసీఎల్‌ అధికారులకు లేఖ రాయాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. దీనివల్ల అక్రమ నిర్మాణాలకు బ్రేక్‌ పడుతుందని, బీపీఎస్‌కు అందరూ ముందుకువస్తారని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది.

Updated Date - 2020-11-19T05:54:49+05:30 IST