-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » boy missing at seashore
-
అయ్యో...పాపం
ABN , First Publish Date - 2020-12-28T05:17:33+05:30 IST
సరదాగా స్నేహితులతో కలిసి తీరంలో గడిపేందుకు వచ్చిన 11 ఏళ్ల బాలుడు ఆదివారం గల్లంతయ్యాడు. ముత్యాలమ్మపాలెం బీచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ముత్యాలమ్మపాలెం తీరంలో బాలుడు గల్లంతు
స్నేహితులతో కలిసి ఈతకు దిగగా ఘోరం
పరవాడ, డిసెంబరు 27: సరదాగా స్నేహితులతో కలిసి తీరంలో గడిపేందుకు వచ్చిన 11 ఏళ్ల బాలుడు ఆదివారం గల్లంతయ్యాడు. ముత్యాలమ్మపాలెం బీచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుచ్చెయ్యపేట మండలం పంగిడి గ్రామానికి చెందిన 19 మంది విద్యార్థులు ముత్యాలమ్మపాలెం తీరానికి మధ్యాహ్నం 2 గంటల సమయయంలో చేరుకున్నారు. వీరిలో మేరపురెడ్డి కార్తీక్ (11)తో పాటు వారి సోదరుడు శ్రీను, మరో ముగ్గురు కలిసి బీచ్‌లో ఈతకు దిగారు.
ఆ సమయంలో పెద్ద ఎత్తున కెరటాలు రావడంతో ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోయారు. దీంతో అక్కడే వున్న గజ ఈతగాళ్లు నలుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కార్తీక్ ఆచూకీ తెలియరాలేదు. ఇదిలావుండగా 19 మంది మూడు ఆటోల్లో ముందుగా కొండకర్లఆవ, తంతడి బీచ్ పరిసర ప్రాంతాలు తిరిగి మధ్యాహ్నం ముత్యాలమ్మపాలెంకు చేరుకున్నారు.
భోజనాలు ముగిసిన తరువాత ఈతకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. కార్తీక్ ఆరో తరగతి చదువుతున్నాడు. తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరవాడ సీఐ ఉమామహేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.