రైలు ఢీకొని బధిర బాలుడి మృతి

ABN , First Publish Date - 2020-12-07T05:10:40+05:30 IST

రైలు పట్టాలకు సమీపంలో సెల్‌ఫోన్‌ చూడడంలో నిమగ్నమైన ఓ బధిరుడైన బాలుడిని రైలు ఢీకొనడంతో త్రీవ గాయాలతో మృతి చెందాడు.

రైలు ఢీకొని బధిర బాలుడి మృతి
మృతుడు మోహన్‌ (ఫైల్‌ ఫొటో)

గోపాలపట్నం, డిసెంబరు 6: రైలు పట్టాలకు సమీపంలో సెల్‌ఫోన్‌ చూడడంలో నిమగ్నమైన ఓ బధిరుడైన బాలుడిని రైలు ఢీకొనడంతో త్రీవ గాయాలతో మృతి చెందాడు. జీఆర్పీ ఎస్‌ఐ షేక్‌ షరీఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం వేపగుంట సమీపంలోని చీమలాపల్లి ప్రాంతానికి చెందిన గరబాబు మోహన్‌(14) పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో నార్త్‌ సింహాచలం రైల్వే హాల్టింగ్‌ వద్దకు వచ్చాడు. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ చూడడంలో నిమగ్నమయ్యాడు. అయితే ఆ బాలుడు నిలబడి ఉన్న ట్రాక్‌పై విజయనగరం నుంచి విశాఖ వైపు ఓ గూడ్స్‌ రైలు వస్తోంది. లోకో పైలట్‌ ఆ బాలుడిని చూసి అప్రమత్తం చేయడానికి హారన్‌ మోగించాడు. అయితే ఆ బాలుడు బధిరుడు కావడంతో హారన్‌ శబ్ధం వినిపించలేదు. రైలు ఢీకొనడంతో ఆ బాలుడి ఎడమ కాలు నుజ్జు కావడంతో పాటు శరీరానికి బలమైన గాయాలయ్యాయి. అయితే కాస్త దూరం వెళ్లిన వెంటనే రైలు నిలిపిన లోకో పైలట్‌ తోటి సిబ్బంది సాయంతో సమీపంలో కేబిన్‌ వరకు క్షతగాత్రుడిని తీసుకువెళ్లారు. వెంటనే 108కు సమాచారం అందజేసి కేజీహెచ్‌కి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో బాలుడు మృతి చెందినట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎస్‌ఐ షరీఫ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read more