పేదల ఇళ్లకు భారతి సిమెంటు

ABN , First Publish Date - 2020-12-28T05:21:30+05:30 IST

పేదల ఇళ్ల నిర్మాణాలకు ముడిసరుకు తానే సరఫరా చేస్తానని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నారని.. ఇదో పెద్ద దోపిడీగా ప్రజలు అర్థం చేసుకోవాలని మాజీ మంత్రి సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు అన్నారు.

పేదల ఇళ్లకు భారతి సిమెంటు

 బంధువుల కంపెనీల నుంచి ఐరన్‌

  దోపిడీకి చూస్తున్న సీఎం జగన్‌ 

 మాజీ మంత్రి అయ్యన్న  ఆరోపణ

నర్సీపట్నం, డిసెంబరు 27 : పేదల ఇళ్ల నిర్మాణాలకు ముడిసరుకు తానే సరఫరా చేస్తానని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నారని.. ఇదో పెద్ద దోపిడీగా ప్రజలు అర్థం చేసుకోవాలని మాజీ మంత్రి సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు అన్నారు. స్థానిక విలేఖర్లకు ఆదివారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  ఇళ్లకు మెటీరియల్‌ తానే సరఫరా చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నారని, ఆయన భార్యకు సంబంధించిన భారతి సిమెంట్‌, బంధువుల కంపెనీల నుంచి ఐరన్‌ సరఫరా చేసి దోపిడీ చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. పోలవరం నిర్మాణం, ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పెండింగ్‌ బిల్లులు ఇవ్వడానికి ఖజానాలో డబ్బులు లేకపోతే, రూ.50వేల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నానని పబ్లిసిటీ ఎలా చేసుకుంటారని నిలదీశారు. ఇది పేద ప్రజలను మోసం చేయడం కాదా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదని దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారని, మంచి పద్ధతి కాదని హితవు పలికారు. టిడ్కో గృహాలు తానే నిర్మాణం చేస్తున్నట్టు జగన్‌మోహన్‌రెడ్డి రంగులు వేసుకుంటుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఎందుకు మాట్లాడడం లేదని ఆయ్యన్న ప్రశ్నించారు. 


Updated Date - 2020-12-28T05:21:30+05:30 IST