మాజీ మంత్రి బాలరాజుకు చుక్కెదురు

ABN , First Publish Date - 2020-03-12T17:34:54+05:30 IST

వైసీపీలో చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుకి..

మాజీ మంత్రి బాలరాజుకు చుక్కెదురు

గూడెంకొత్తవీధి(విశాఖపట్నం): వైసీపీలో చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుకి చుక్కెదురైంది. రెండు నెలల కిందట జనసేన పార్టీకి రాజీనామా చేసిన ఆయన, మంగళవారం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వు కావడంతో తన కుమార్తె డాక్టర్‌ దర్శినికి గూడెంకొత్తవీధి జడ్‌పీటీసీ నుంచి వైసీసీ తరపున బరిలో దింపాలన్న ఉద్దేశంతో బాలరాజు వైసీపీ తరపున పోటీ చేయించాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆ పార్టీలో చేరారని భావిస్తున్నారు.


అదే విధంగా బాలరాజు కుమార్తెకు జీకే వీధి టిక్కెట్టు ఇచ్చిన ప్రచారం కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఇంటి వద్ద నిరసన వ్యక్తంచేశారు. ఆమె హుటాహుటిన విశాఖపట్నం వెళ్లి, బాలరాజు చేరికను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి వద్ద పంచాయితీ పెట్టారు. జీకేవీధి జడ్‌పీటీసీ టిక్కెట్లును బాలరాజు కుమార్తెకు కేటాయించవద్దని విన్నవించుకున్నారు. దీంతో అధినాయకత్వం ప్రత్యామ్నయ ఆలోచనలో పడింది.


అయితే ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సిఫారసు చేసిన అభ్యర్థికి కాకుండ గతంలో పాడేరు సమన్వయకర్తగా పనిచేసి, ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు భార్య శివరత్నానికి జడ్‌పీటీసీ టిక్కెట్టు కేటాయించారు. ఈ పరిణామంతో బాలరాజు వర్గీయులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. అయితే పదవుల కోసం వైసీపీలో చేరలేదని, పార్టీ విధానాలు, జగన్‌ పరిపాలన నచ్చి పార్టీలో చేరామంటూ బాలరాజు తన మద్దతుదారులను సముదాయించారు.

Updated Date - 2020-03-12T17:34:54+05:30 IST