‘ప్రజలు మీ పక్షాన ఉంటే.. స్థానిక ఎన్నికలకు భయమెందుకు..?

ABN , First Publish Date - 2020-12-15T05:53:06+05:30 IST

‘ప్రజలు మీ పక్షాన ఉంటే.. స్థానిక ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారని మాజీ మంత్రి సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

‘ప్రజలు మీ పక్షాన ఉంటే.. స్థానిక ఎన్నికలకు భయమెందుకు..?
మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

 మాజీ మంత్రి అయ్యన్న సూటి ప్రశ్న

నర్సీపట్నం, డిసెంబరు 14 : ‘ప్రజలు మీ పక్షాన ఉంటే.. స్థానిక ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారని మాజీ మంత్రి సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించారు. సోమవారం ఇక్కడి విలేఖరులకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మాట్లాడితే ప్రజలు తమ పక్కన ఉన్నారని ఎమ్మెల్యే అంటున్నారని, అలాంటప్పుడు స్థానిక ఎన్నికలకు మీ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో టీడీపీ హయాంలోని 34 పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం మీది కాదా.. అని నిలదీశారు. నర్సీపట్నంలో వార్డుకు 50 నుంచి 100 రేషన్‌ కార్డులు ఎందు తీసేశారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. ఆస్తి పన్ను కోసం తీసుకొచ్చిన చట్టంపై పట్టణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. 

పథకాలు పెట్టడం.. కమీషన్లు దండుకోవడం... 

జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక పథకం పెట్టడం, అందులో కమీషన్లు దండుకోవడం జరుగుతుందని ఆరోపిస్తూ..  జైలు బుద్ధి పోనిచ్చుకోలేదని అయ్యన్న విమర్శించారు. ఇసుక దగ్గర నుంచి మద్యం వరకు జె టాక్స్‌ పేరుతో  దోపిడీ చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కాకుండానే రూ.2.40లక్ష కోట్లు అప్పులు చేశారని, ఇంత అప్పు చేసిన ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడా చూడలేదని అయ్యన్న పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-15T05:53:06+05:30 IST