భూమి ఇచ్చిన వారికి పరిహారం ఇప్పించండి

ABN , First Publish Date - 2020-05-24T08:17:53+05:30 IST

మండలంలోని అమలాపురం పంచాయతీ అన్నంపేటలో ఇళ్ల స్థలాల కోసం భూములిచ్చిన బత్తుల మంగరత్నం, వెంకటలక్ష్మిలకు పరిహారం ..

భూమి ఇచ్చిన వారికి పరిహారం ఇప్పించండి

తహసీల్దార్‌ను కోరిన మాజీ మంత్రి అయ్యన్న

వైసీపీ నాయకులురూ.12 లక్షలు తమ వద్ద ఉంచుకున్నారని ఆరోపణ

పరిహారం రాని పక్షంలో కోర్టు మెట్లు ఎక్కిస్తానని హెచ్చరిక


నర్సీపట్నం టౌన్‌ : మండలంలోని అమలాపురం పంచాయతీ అన్నంపేటలో ఇళ్ల స్థలాల కోసం భూములిచ్చిన బత్తుల మంగరత్నం, వెంకటలక్ష్మిలకు పరిహారం డబ్బులు ఇప్పించాలని  తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ మేరకు శనివారం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈ బాధితులకు పరిహారం ఇప్పించాల్సిన బాధ్యత తహసీల్దార్‌దేనన్నారు. లేని పక్షంలో కోర్టు మెట్లు ఎక్కిస్తానని హెచ్చరించారు.  అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నంపేటకు చెందిన మంగరత్నం, వెంకటలక్ష్మిల నుంచి ఇళ్ల స్థలాల కోసం సుమారు మూడు ఎకరాల డి-పట్టా భూమిని సేకరించారన్నారు. ప్రభుత్వం పరిహారం కింద ఎకరాకు రూ.15 లక్షలు చొప్పున మూడు ఎకరాలకు రూ.45 లక్షలు ఇచ్చిందన్నారు.


అయితే బాధితులకు రూ.30లక్షలు మాత్రమే పరిహారం అందిందన్నారు. మిగిలిన రూ.15 లక్షల్లో కుటుంబ సభ్యులకు రూ. 3 లక్షలు వాటాగా సెటిల్‌మెంట్‌ చేసుకోగా, మిగిలిన రూ.12 లక్షలు వైసీపీ నాయకులు ఎరకన్నపాలేనికి చెందిన సుర్ల సత్యనారాయణ, అమలాపురానికి చెందిన శెట్టి శ్రీను వద్ద ఉన్నాయని తెలిపారు. డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే అధికారులకు లంచాలు ఇవ్వాలని చెబుతున్నారని ఆరోపించారు. ఇదిలావుంటే, ఈ అంశంపై తహసీల్దార్‌ మాట్లాడుతూ భూసేకరణ పరిహారం నేరుగా బాధితుల బ్యాంక్‌ ఖాతాల్లో జమవుతుందన్నారు. వారే డ్రా చేసుకుంటారని అయ్యన్నకు వివరించారు. ఇక్కడ ఎవరూ డబ్బులు అడగలేదని చెప్పారు.  మంగరత్నం, వెంకటలక్ష్మిలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన డి- పట్టా భూమిని ఇళ్ల స్థలాలకు అవసరమై ప్రభుత్వం తీసుకుని పరిహారం ఇచ్చినట్టు స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-24T08:17:53+05:30 IST