ఆటో డ్రైవర్‌ చొరవతో ఇంటికి చేరిన యువకుడు

ABN , First Publish Date - 2020-12-08T04:33:20+05:30 IST

తల్లిదండ్రులపై అలిగి ఇంట్లోంచి పారిపోయి విశాఖ వచ్చిన ఓ యువకుడిని ఆటో డ్రైవర్‌ ఆదుకుని వారి బంధువులకు అప్పగించాడు.

ఆటో డ్రైవర్‌ చొరవతో ఇంటికి చేరిన యువకుడు
బంధువులతో ఇమన్‌ ఎక్కా (ఎడమ నుంచి మూడో వ్యక్తి)

మల్కాపురం, డిసెంబరు 7 : తల్లిదండ్రులపై అలిగి ఇంట్లోంచి పారిపోయి విశాఖ వచ్చిన ఓ యువకుడిని ఆటో డ్రైవర్‌ ఆదుకుని వారి బంధువులకు అప్పగించాడు. జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీ జిల్లాకు చెందిన ఇమన్‌ ఎక్కా ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. గత నెల 23న తల్లిదండ్రులతో గొడవ పడి అలిగి ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. విశాఖ చేరుకుని పది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో తిరిగి ఈ నెల 5న అర్ధరాత్రి సమయంలో సింథియా వచ్చి అక్కడ పార్కింగ్‌ చేసి ఉన్న ఆటోలో నిద్రించాడు. ఆ ఆటో డ్రైవర్‌ సంతోశ్‌ గమనించి ఆ యువకుడిని వివరాలు అడిగాడు. పది రోజులుగా ఏమీ తినలేదని, ఆకలిగా ఉందని ఆ యువకుడు చెప్పడంతో వెంటనే భోజనం ఏర్పాటు చేశాడు. ఆ యువకుడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దీంతో ఆ యువకుని బంధువులు సోమవారం సింథియా చేరుకున్నారు. వారికి ఆ యువకుడిని అప్పగించాడు. ఆటో డ్రైవర్‌ను వారు అభినందించారు.  


Updated Date - 2020-12-08T04:33:20+05:30 IST