ఆశా వర్కర్ల రణభేరి
ABN , First Publish Date - 2020-11-03T06:13:43+05:30 IST
సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు రణనినాదం చేశారు. వేతనాలు ఒకే విడత సక్రమంగా చెల్లించాలి, సచివాలయాల పరిధి నుంచి తమను తప్పించాలి వంటి ప్రధాన డిమాండ్లతోపాటు మరికొన్ని సమస్యలపై సోమవారం కలెక్టరేట్ ఎదుట నినదించారు.
సమస్యల పరిష్కారంపై నినదించిన ఆందోళనకారులు
కలెక్టరేట్ ముట్టడికి యత్నం...అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
మహారాణిపేట, నవంబరు 2: సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు రణనినాదం చేశారు. వేతనాలు ఒకే విడత సక్రమంగా చెల్లించాలి, సచివాలయాల పరిధి నుంచి తమను తప్పించాలి వంటి ప్రధాన డిమాండ్లతోపాటు మరికొన్ని సమస్యలపై సోమవారం కలెక్టరేట్ ఎదుట నినదించారు. దాదాపు రెండు వందల మంది ఆశా కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు తోపులాటలు, వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే...విశాఖ జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చారు. సమస్యలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించారు. నిరసన సమాచారంతో అప్పటికే కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. బలవంతంగా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుని ఈడ్చుకుని వెళ్లి వాహనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్యతోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ కొందరు ఆందోళనకారులు అక్కడే బైఠాయించారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు కొందరిని మాత్రం పోలీసులు లోపలికి అనుమతించడంతో ఆందోళనకారులు శాంతించారు.
ఈ సందర్భంగా పలువురు ఆశావర్కర్లు మాట్లాడుతూ కొవిడ్ విధులకు తమను పంపుతున్నా అవసరమైన రక్షణ పరికరాలు అందించడం లేదని, కనీసం మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ లేకుండా విధులు నిర్వహిస్తుండడంతో ఇప్పటికే ఎంతోమంది వర్కర్లు అనారోగ్యం బారిన పడ్డారని తెలిపారు. కరోనా విధులు నిర్వహిస్తున్నందున నెలకు వేతనం రూ.10వేలు ఇస్తామన్న మాట కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఇచ్చే జీతం రూ.6వేలు కూడా ఒకేసారి కాకుండా దపదపాలుగా చెల్లిస్తామంటున్నారని వాపోయారు.
సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు కూడా మాకే అప్పగిస్తుండడంతో పనిఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. అందువల్ల తమను సచివాలయాల పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తమ సమస్యలు కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు వచ్చిన తమపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం అన్యాయమని వాపోయారు. పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లా తమకూ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.