చైన్‌స్నాచింగ్‌ నిందితుడు అరెస్టు

ABN , First Publish Date - 2020-11-19T05:56:36+05:30 IST

మృద్ధురాలి మెడలో పసుపుతాడును బంగారం అనుకుని దాన్ని తెంపే ప్రయత్నంలో ఆమె మృతికి కారణమైన నిందితుడు వియ్యపు గణేష్‌ (20)ను అరెస్టు చేసినట్లు క్రైం ఏడీసీపీ వేణుగోపాలనాయుడు తెలిపారు.

చైన్‌స్నాచింగ్‌ నిందితుడు అరెస్టు
వివరాలు చెబుతున్న ఏడీసీపీ వేణుగోపాలనాయుడు

మహారాణిపేట, నవంబరు 18: మృద్ధురాలి మెడలో పసుపుతాడును బంగారం అనుకుని దాన్ని తెంపే ప్రయత్నంలో ఆమె మృతికి కారణమైన నిందితుడు వియ్యపు గణేష్‌ (20)ను అరెస్టు చేసినట్లు క్రైం ఏడీసీపీ వేణుగోపాలనాయుడు తెలిపారు. కమిషనరేట్‌లో  బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 3 గంటల సమయంలో వెన్నెల గెస్ట్‌హౌస్‌లో పనిచేస్తున్న పాపయ్యమ్మ అనే వృద్ధురాలి మెడలోని తాడును గణేష్‌ తెంచే ప్రయత్నం చేశాడని, ఆ సందర్భంగా ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని తెలిపారు. దీంతో గణేష్‌ ఆ వృద్ధురాలిని తీవ్రంగా కొట్టి తాడు తెంచి చూసుకుంటే ఆ తాడులో ఇంటి బీరువా తాళం తప్ప మరేమీ లేవన్నారు. దీంతో వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి తాళంతో బీరువా తెరిచి ఏమీ దొరకకపోవడంతో నిరాశతో వెళ్లిపోయాడని తెలిపారు. అయితే చైన్‌స్నాచింగ్‌ సందర్భంగా తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు ఈనెల 16న చికిత్స పొందుతూ చనిపోవడంతో మృతురాలి కొడుకు సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏడీసీపీ వివరించారు. ఈ ఘటనకు అదే ప్రాంతానికి చెందిన గణేష్‌ కారకుడని గుర్తించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 


 

 

 

Updated Date - 2020-11-19T05:56:36+05:30 IST