మమ్మల్ని అవమానించడమే!
ABN , First Publish Date - 2020-03-02T10:33:22+05:30 IST
పదో తరగతి పరీక్షల నిర్వహణలో..

సచివాలయ ఉద్యోగులు ఇన్విజిలేటర్లా?
టెన్త్ పరీక్షల్లో కీలక బాధ్యతలు
టీచర్ల స్థానంలో వీరి సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వ నిర్ణయం
సూత్రప్రాయంగా వెల్లడించిన విద్యా శాఖ మంత్రి
మూడు నెలల ఉద్యోగ అనుభవంతో పరీక్షల నిర్వహణ విధులు
భగ్గుమంటున్న ఉపాధ్యాయ సంఘాలు
తమను అనుమానించి, అవమానించడమేనని టీచర్ల ఆవేదన
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): పదో తరగతి పరీక్షల నిర్వహణలో కీలకమైన ఇన్విజిలేటర్ల బాధ్యతలను గ్రామ సచివాలయ ఉద్యోగులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇదే విషయాన్ని రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల సూత్రప్రాయంగా చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇన్విజిలేటర్లకు సంబంధించి త్వరలో స్పష్టమైన ఆదేశాలు రావచ్చునని విద్యా శాఖవర్గాలు చెబుతున్నాయి. కాగా పదో తరగతి పరీక్షల నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న తమను ప్రభుత్వం అనుమానిస్తున్నదని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బోధనేతర బాధ్యతలు అప్పగించవద్దని తాము చాలా కాలం నుంచి పోరాటం చేస్తుండగా, మరోవైపు బోధనలో భాగమైన పదో తరగతి పరీక్షల నుంచి తమను తప్పించాలని ప్రతిపాదించడం అవమానించినట్టేనని వాపోతున్నారు.
గ్రామాలు, పట్టణప్రాంతాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వాలు వినియోగించుకుంటున్నాయి. అయితే ఇటువంటి బోధనేతర పనుల వల్ల బోధనపై ప్రభావం పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. అన్ని రకాల ప్రభుత్వ పథకాలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సేవలను వీటి ద్వారా అందించాలన్నది ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు జిల్లాలో 1,342 గ్రామ/ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. సుమారు 13 శాఖలకు సంబంధించి ఉద్యోగుల నియామకం కూడా చేపట్టింది. జనవరి ఒకటో తేదీన సచివాలయాలను ప్రారంభించగా, అదే నెల 26వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వానికి కీలకమైన నవరత్నాల అమలు బాధ్యతను ప్రభుత్వం సచివాలయాల సిబ్బందికి అప్పగించింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ బాధ్యతను కూడా వీరికే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల సూత్రప్రాయంగా ఈ విషయం చెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
టెన్త్ పరీక్షల నిర్వహణలో కొత్త ఒరవడి
పదో తరగతి పరీక్షల నిర్వహణ టీచర్లకు కొట్టినపిండి. ఏళ్ల తరబడి ఇన్విజిలేటర్లుగా పనిచేసిన టీచర్లు, పదో తరగతి పరీక్షలను సాఫీగా నిర్వహిస్తున్నారు. గతంలో అక్కడక్కడా మాస్ కాపీయింగ్ జరిగేది. జంబ్లింగ్ విధానం వచ్చిన తరువాత ఒక పాఠశాలకు చెందిన విద్యార్థులు రెండు మూడు సెంటర్లలో పరీక్షలు రాస్తున్నారు. ఏజెన్సీలోని కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నది. దీంతో కాపీయింగ్ చాలా వరకు తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నదని, అందుకే సచివాలయాల ఉద్యోగులతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసిందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్య తమను అవమానించడమేనని ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యావ్యవస్థలో పరీక్షలు అనేవి ఒక భాగమని, టీచర్లను కాదని సచివాలయ సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రయోగాలు చేయలేదని సీనియర్ టీచర్ ఒకరు వ్యాఖ్యానించారు. విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయాలనుకుంటే టీచర్లను బోధనకే పరిమితం చేయాలని సూచిస్తున్నారు. మూడు నెలల క్రితం ఉద్యోగంలో చేరి, విధుల నిర్వహణలో తడబడుతున్న గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు పదో తరగతి పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలనుకోవడం మంచిది కాదని అంటున్నారు.
ఆలోచన సరైందికాదు
పదో తరగతి పరీక్షల నిర్వహణలో కీలకమైన ఇన్విజిలేటర్లుగా సచివాలయ ఉద్యోగుల్ని నియమించాలనే ఆలోచన సరైంది కాదు. ఏళ్లతరబడి టీచర్లే ఇన్విజిలేటర్లగా పనిచేస్తున్నారు. పరీక్షల నిర్వహణ ఎంతో క్లిష్టమైనది. ఓఎంఆర్ షీట్ పూరించడం నుంచి పరీక్ష ముగిసే వరకు హాలులో జరిగే ప్రతి సంఘటనకు టీచర్ బాధ్యుడు. పాఠశాలల్లో పలు రకాల పరీక్షలు నిర్వహించిన అనుభవం టీచర్లకు ఉంటుంది. ఇన్విజిలేషన్ కూడా బోధనలో భాగమేనని గుర్తించాలి.
- ఈ.పైడిరాజు, ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ, విశాఖ జిల్లా
టీచర్లను కించపర్చడమే
పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్లుగా టీచర్లను నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. బోధనేతర విధులు వద్దని చాలా కాలంగా కోరుతున్నాం. పదో తరగతి పరీక్షలకు సచివాలయ సిబ్బందిని ఇన్విజిలేటర్లగా నియమిస్తామని విద్యా శాఖామంత్రి చేసిన ప్రకటన ఉపాధ్యాయ వ్యవస్థను కించపర్చేలా వుంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటీ? అనేది ఆలోచించాలి.
- జి.మధు, రాష్ట్ర కార్యదర్శి, డీటీఎఫ్
ఇన్విజిలేటర్లుగా టీచర్లే ఉండాలి
పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్లు టీచర్లనే నియమించాలి. ఓఎంఆర్ షీట్ నిర్వహణతోపాటు ఇతర పనుల్లో టీచర్లకు అనుభవం ఉంటుంది. కొత్తగా వచ్చిన సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించిన అనుభవం లేదు. ఒకవేళ సబ్జెక్టు టీచర్ల వద్దనుకుంటే సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించండి.
- డి.గోపీనాథ్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్‌టీయూ