ఏపీపీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట

ABN , First Publish Date - 2020-10-24T10:39:51+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.

ఏపీపీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట

నానో టెక్నాలజీ విభాగంలో చోడవరం విద్యార్థి అరుణ్‌సాయికి ప్రథమ స్థానం

ఈసీఈలో 4, జియో ఇంజనీరింగ్‌ అండ్‌ జియో ఇన్ఫర్మేటిక్స్‌లో 4,

మెకానికల్‌లో 4, ఎంఫార్మసీలో ఐదో ర్యాంకు సాధించిన జిల్లా విద్యార్థులు

జిల్లా నుంచి 2,542 మంది హాజరు

2,264 మంది ఉత్తీర్ణత


విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లా నుంచి 2,542 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 2,264 మంది (89.06 శాతం) అర్హత సాధించారు. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు పలు విభాగాల్లో ఉత్తమ ర్యాంకులను సాధించారు.


నానో టెక్నాలజీ విభాగంలో చోడవరానికి చెందిన అనకాపల్లి అరుణ్‌సాయి 43 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా బయో టెక్నాలజీ విభాగంలో సబ్బవరానికి చెందిన ప్రత్యూష ఐదో ర్యాంకు, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో మునగపాకకు చెందిన గుత్తుల లక్ష్మీసత్య శరణ్య నాలుగో ర్యాంకు, జియో ఇంజనీరింగ్‌ అండ్‌ జియో ఇన్ఫర్మేటిక్స్‌ విభాగంలో రోలుగుంటకు చెందిన మడ్డు దుర్గావరప్రసాద్‌ నాలుగో ర్యాంకు, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో మల్కాపురానికి చెందిన వల్లపుదాసు శ్యామ్‌సుందర్‌ నాలుగో ర్యాంకు సాధించారు. అదేవిధంగా ఎంఫార్మసీకి సంబంధించి గోపాలపట్నం ప్రాంతానికి చెందిన 86 మార్కులతో తమ్మినేని దివ్య ఐదో ర్యాంకు సాధించి సత్తా చాటింది. 


ఏయూ నుంచే ఎక్కువ మంది హాజరు

ఏపీపీజీఈసెట్‌కు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధి నుంచే ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 28,868 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, అందులో ఒక్క ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి నుంచే 15,657 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 13,772 మంది (87.96 శాతం) అర్హత సాధించారు.

Updated Date - 2020-10-24T10:39:51+05:30 IST