సామాన్యులకు సజావుగా అప్పన్న వైకుంఠద్వార దర్శనం

ABN , First Publish Date - 2020-12-20T05:26:14+05:30 IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈనెల 25న సింహాద్రి అప్పన్న స్వామిని ఉత్తర ద్వారంలో తిలకించేందుకు వచ్చే సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్‌ కోటేశ్వరరావు, గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు పేర్కొన్నారు.

సామాన్యులకు సజావుగా అప్పన్న వైకుంఠద్వార దర్శనం
క్యూ లైన్ల మ్యాప్‌ను పరిశీలిస్తున్న గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు, తదితరులు

25వ తేదీ వేకువజాము 3 గంటల నుంచి రూ.300. రూ.100 టికెట్ల విక్రయాలు

ఈఈ కోటేశ్వరరావు, సీఐ అప్పారావు

సింహాచలం, డిసెంబరు 19: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈనెల 25న సింహాద్రి అప్పన్న స్వామిని ఉత్తర ద్వారంలో తిలకించేందుకు వచ్చే సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్‌ కోటేశ్వరరావు, గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు పేర్కొన్నారు. దేవస్థానం అధికారులతో కలిసి సీఐ శనివారం దేవాలయంలో ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్లను పరిశీలించారు. ఈనెల 22 నుంచి ప్రత్యేకంగా రూ.500 టికెట్లు  విక్రయించనుండగా.. 25వ తేదీ వేకువజాము మూడు గంటల నుంచి అతి శ్రీఘ్రదర్శనం రూ.300 టికెట్లు, రూ.100, ఉచిత దర్శనం టికెట్లను కొండదిగువన విక్రయించాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా సింహగిరికి బస్సులను కూడా అదే సమయంలో నడపనున్నారు. ఇంజనీరింగ్‌ అధికారుల అంచనా ప్రకారం 1,500 రన్నింగ్‌ మీటర్ల నిడివితో క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఒకే సమయంలో సుమారు పదివేల మంది భక్తులు నిల్చొనే అవకాశం ఉంటుంది. అలాగే వాహనాల టికెట్లను రెండో ఘాట్‌రోడ్డు టోల్‌గేటు, పాత టోల్‌గేటు వద్ద విక్రయించాలని ప్రతిపాదించారు. ఆ రోజు తెల్లవారుజాము నాలుగున్నలోపు అనువంశిక ధర్మకర్త, వారి కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పించాక, ఐదు గంటల నుంచి భక్తులకు స్వామివారి వైకుంఠద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. క్యూల నిర్వహణకు సుమారు 250 మంది పోలీసులను 24వ తేదీ రాత్రి పది నుంచి 25వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండు షిఫ్ట్‌ల్లో విధులకు కేటాయించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. జీవీఎంసీ, హెల్త్‌, పోలీస్‌, ఫైర్‌, తదితర ప్రభుత్వ శాఖలతో త్వరలో జరిగే సమన్వయ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పర్యటనలో ఏఈవో కేకే రాఘవకుమార్‌, పర్యవేక్షణాధికారి వి.కామేశ్వరరావు, ఏఈ రవితేజ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T05:26:14+05:30 IST