జీవీఎంసీకి మరో అవార్డు

ABN , First Publish Date - 2020-12-27T06:16:41+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)కు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.

జీవీఎంసీకి మరో అవార్డు
కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన దుర్గ ఇల్లు

ఇన్నోవేటివ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ కేటగిరీలో ఉత్తమ ప్రదర్శన

పెదగంట్యాడకు చెందిన సత్రబోయిన దుర్గ  నిర్మించిన ఇంటికి కేంద్రం గుర్తింపు


విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)కు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన్‌ (అర్బన్‌)-2019 పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణంలో ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలను రాబట్టినందుకుగాను ఇన్నోవేటివ్‌ కనస్ట్రక్షన్‌ టెక్నాలజీ కేటగిరీలో జీవీఎంసీకి అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహరాల శాఖ డైరెక్టర్‌ అమృత్‌ అభిజిత్‌ శనివారం ప్రకటన చేశారు. 


పెదగంట్యాడలోని సత్రబోయిన దుర్గకు బెనిఫిషరీ లెడ్‌ కనస్ట్రక్షన్‌ (బీఎల్‌సీ) కింద ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారునికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం ద్వారా అత్యుత్తమంగా ఇంటిని నిర్మించుకునేలా కృషిచేసింది. దేశంలోని రాష్ట్రాలు, కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట గ్లోబల్‌ హౌసింగ్‌ టెక్నాలజీ ఛాలెంజ్‌ ఇండియా-2019 పేరుతో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ప్రభుత్వ గృహాల నిర్మాణంలో అవలంబించిన పద్ధతులు, సాధించిన ఫలితాలకు సంబంధించిన ప్రాజెక్టులను సమర్పించాలని కోరింది. దీనికి దేశవ్యాప్తంగా 54 నగరాల నుంచి వెయ్యి వరకూ ప్రాజెక్టులు కేంద్రానికి అందాయి. వీటిని  పరిశీలించిన కేంద్రం ఇన్నోవేటివ్‌ కన్‌స్ట్రక్టన్‌ టెక్నాలజీ విభాగంలో ఏపీ నుంచి పెదగంట్యాడకు చెందిన సత్రబోయిన దుర్గ నిర్మించిన ఇంటిని మూడవ ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేసి అవార్డు ప్రకటించింది. వచ్చే నెల ఒకటిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులో భేటీ అయి, అవార్డులను అందజేస్తారు. అవార్డు దక్కిన జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు..లబ్ధిదారుడితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కేంద్రం స్పష్టంచేసింది. జీవీఎంసీకి అవార్డు దక్కడం పట్ల కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన సంతోషం వ్యక్తంచేశారు. ఇదే స్ఫూర్తితో మరింత ఉత్తమ సేవలందించేందుకు కృషిచేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-12-27T06:16:41+05:30 IST