గర్భిణుల్లో రక్తహీనత

ABN , First Publish Date - 2020-12-30T05:59:18+05:30 IST

గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కని పిస్తోంది. ప్రతి ఇద్దరిలో ఒకరు రక్త హీనతతో బాధపడుతున్నారు.

గర్భిణుల్లో రక్తహీనత

ప్రతి ఇద్దరిలో ఒకరిని వేధిస్తున్న సమస్య

గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన వారిలో మరింత ఎక్కువ 

ప్రసవ సమయంలో సమస్యలు

బిడ్డ ఎదుగుదలపైనా ప్రభావం

జిల్లాలో ఏటా గర్భం దాల్చే మహిళల సంఖ్య 60-70 వేలు

రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య 30-35 వేలు

రక్తహీనత వల్ల సిజేరియన్‌ అవసరమవుతున్న వారు 3,500


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కని పిస్తోంది. ప్రతి ఇద్దరిలో ఒకరు రక్త హీనతతో బాధపడుతున్నారు. జిల్లాలో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పరీక్షలకు వస్తున్న ప్రతి పది మందిలో ముగ్గురు, ప్రభుత్వ ఆస్పత్రులైన కేజీహెచ్‌, ఘోషా ఆసుపత్రులకు వస్తున్న ప్రతి పది మందిలో ఏడుగురిలో రక్తహీనత కనిపిస్తోంది. జిల్లాలో ఏటా 60-70 వేల మంది గర్భం దాలుస్తుండగా, వీరిలో సగం మంది అంటే 30-35 వేల మందిలో రక్తహీనత సమస్యను ఎదుర్కొంటు న్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడే వారికే ఎక్కువగా సిజేరియన్‌ చేయాల్సిన అవసరం ఏర్పడుతోందంటున్నారు. 


ఇదీ ప్రధాన కారణం

రక్తహీనతకు ప్రధాన కారణం పోషకాహార లోపం. ఎక్కువ మందిలో ఐరన్‌ లోపం ఎక్కువగా కని పిస్తోంది. అదేవిధంగా ఏ, బీ 12, బీ 2, సీ, డీ, ఈ, విటమిన్లు, రాగి, జింక్‌  లోపం వల్ల రక్తహీనత బారినపడుతున్నారు.రక్తహీనతతో బాధపడే గర్భిణుల్లో తీవ్రమైన అలసట, కళ్లు పాలిపోవడం, ఆయాసం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. హిమో గ్లోబిన్‌ పరీక్ష ద్వారా రక్తహీనతను నిర్ధారించవచ్చు. హిమోగ్లోబిన్‌ 11 గ్రాములు వుంటే రక్తహీనత సమస్య లేనట్టుగా భావించాలి. అంతకంటే తక్కువగా వుంటే..పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఏడు గ్రాములు కంటే తక్కువగా వుంటే మాత్రం ఇబ్బందికరంగానే భావించాలి. ఏడు గ్రాములు కంటే తక్కువ వున్న గర్భిణులకు రక్తహీనతకు కారణం నిర్ధారించి అవసరమైన మందులు ఇస్తారు. ఐరన్‌ లోపం వున్నట్టు నిర్ధారణ అయితే ఐరన్‌ మాత్రలు, ఇంజెక్షన్లు, ఏడు గ్రాముల కంటే తక్కువగా వున్న వారికి ఎర్ర రక్త కణాలను ఎక్కిస్తారు. 


సమస్యలు.. 

రక్తహీనతతో బాధపడే గర్భిణులకు పుట్టబోయే బిడ్డ బరువు తక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్‌ ఏడు గ్రాములు కంటే తక్కువగా వుంటే ప్రసవ సమయంలో హార్ట్‌ ఫెయిల్యూర్‌ కావచ్చునని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 


ఆకుకూరలు, పండ్లు

పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్యకు చెక్‌ చెప్పవచ్చు. ప్రతిరోజూ ఆకుకూరలు, మాంసం, డ్రైఫ్రూట్స్‌, పండ్లు తీసుకోవాలి. బెల్లం, చిక్కీలు వంటివి రోజూ తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య బారినపడకుండా వుండవచ్చునని వైద్యులు చెబుతున్నారు. చాలామందికి పోషకాహారం తీసుకునేందుకు అవకాశమున్నప్పటికీ..నిర్లక్ష్యం కారణంగానే ఈ సమస్య బారినపడుతున్నారు.


పోషకాహారం తీసుకోవాలి

- డాక్టర్‌ టి.రాధ, గైనకాలజిస్ట్‌, గీతం ఆస్పత్రి

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది. గర్భం దాల్చిన తరువాత ఆకుకూరలు, మాంసం, బెల్లం, చిక్కీలు వంటివి ఎక్కువగా తినాలి.

Updated Date - 2020-12-30T05:59:18+05:30 IST