దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-02-08T16:37:16+05:30 IST

ప్రభుత్వం దిగివచ్చింది..

దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): పింఛన్‌ల రద్దుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ అంశం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష తెలుగుదేశానికి అస్త్రంగా మారేలా వున్నదని గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పెండింగ్‌ జాబితాలో అర్హులెవరైనా వుంటే పింఛన్‌ పునరుద్ధరించాలని కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు విశాఖ జిల్లాలో పెండింగ్‌లో పెట్టిన 40,027 పింఛన్లపై లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టాలని ఆదేశాలు వెలువడ్డాయి. పెండింగ్‌లో వుంచిన పింఛన్‌దారుల జాబితాలు ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లాయి. గ్రామీణ ప్రాంతం అయితే ఎంపీడీవోలు, విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో యూసీడీ పీడీ, ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీలలో కమిషనర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.


తాజా ఆదేశాల మేరకు శనివారం నుంచి వలంటీర్లు తమ పరిధిలో పింఛన్‌ నిలిచిపోయిన వారి ఇళ్లకు వెళ్లి సమాచారం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ఒక ఫార్మెట్‌ రూపొందించారు. ఆ నమూనా మేరకు పెండింగ్‌లో వున్న పింఛన్‌దారుల నుంచి వివరాలు సేకరిస్తారు. పింఛన్‌ తీసుకునేందుకు అర్హతలు అందులో చూపించాల్సి ఉంటుంది. ఈనెల 17వ తేదీ వరకు జిల్లాలో 40,027 మంది నుంచి వివరాలు తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. తరువాత ఈనెల 18, 19 తేదీల్లో గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హులైన వారి జాబితాలు ప్రదర్శించి, ఇంకా ఏమైనా అభ్యంతరాలు వుంటే స్వీకరించి 20న తుది జాబితా ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. కాగా పెండింగ్‌లో పెట్టిన పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి వాస్తవాలు పరిశీలించి, అర్హులను తిరిగి జాబితాలో చేర్చాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించామని డీఆర్‌డీఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ విశ్వేశ్వరరావు తెలిపారు. ఎంపీడీవోల నేతృత్వంలో సిబ్బంది శనివారం ఆయా గ్రామాలకు వెళ్లి వివరాలు తీసుకుంటారని తెలిపారు. 


నగరంలో అనుమానమే?

జీవీఎంసీ పరిధిలో పెండింగ్‌ పింఛన్‌దారుల నుంచి వలంటీర్లు వివరాలు సేకరించాల్సి ఉంది. ఈ మేరకు వార్డు సచివాలయాలకు జాబితాలు పంపారు. అయితే నగరంలో కొంతమంది వలంటీర్ల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నలలోనే పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో పెండింగ్‌ పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించకపోతే వారు నష్టపోతారని ఆందోళన వ్యక్తమవుతుంది. 

Updated Date - 2020-02-08T16:37:16+05:30 IST