ఏఎంసీలో రచ్చ!

ABN , First Publish Date - 2020-05-17T08:35:26+05:30 IST

చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు ఆంధ్ర మెడికల్‌ కళాశాల పెద్దలు...ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన

ఏఎంసీలో రచ్చ!

ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేయడంపై

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, జూనియర్‌ డాక్టర్లు ఆందోళన

కొవిడ్‌ ఆస్పత్రులకు మేమే...పాలిమర్స్‌

బాధిత గ్రామాలకు మేమేనా? అంటూ నిలదీత

గ్రామాల్లో వైద్య సేవలకు 40 మందిని కేటాయిస్తూ ఆదేశాలు

విముఖత వ్యక్తం చేస్తున్న వైద్య విద్యార్థులు

కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు చెప్పకుండానే నియామకాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు ఆంధ్ర మెడికల్‌ కళాశాల పెద్దలు...ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన డాక్టర్లను కూడా ఆస్పత్రి వదిలి గ్రామాలకు వెళ్లండంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ప్రజారోగ్య శాఖలో, వైద్య విధాన పరిషత్‌లో వందలాది మంది మెడికల్‌ ఆఫీసర్లు వుండగా, వారి సేవలను ఉపయోగించుకోకుండా...మమ్మల్ని వెళ్లమంటారేమిటి? అని ప్రశ్నిస్తే..వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని మెమోలు ఇస్తున్నారు. ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. వాస్తవానికి ఆంధ్ర మెడికల్‌ కాలేజీకి చెందిన వైద్యులను, విద్యార్థులను ఎక్కడైనా వినియోగించుకోవాలంటే...కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ అనుమతి తప్పనిసరి. ఆయన పరిపాలనాధికారి. ఆయనకు కూడా చెప్పకుండా ప్రిన్సిపాల్‌ వివిధ సేవలకు అందరినీ ఉపయోగిస్తున్నారంటూ జూనియర్‌ వైద్యులు ఆరోపిస్తున్నారు.


ఎలాగంటే..?

కరోనా కట్టడిలో భాగంగా మెడికల్‌ కాలేజీకి చెందిన 45 మంది టీచింగ్‌ స్టాఫ్‌ (ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు)ను, పీజీ విద్యార్థుల (జూడాలు)ను విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో విధులకు పంపించారు. వారక్కడ 50 రోజులు పనిచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..ఎవరైనా కరోనా ఆస్పత్రిలో సేవలు అందిస్తే...రెండు వారాలు ముగియగానే వారిని మరో రెండు వారాలు క్వారంటైన్‌కు పంపించాలి. కానీ ఇక్కడ ఆ విధానం పాటించలేదు. ‘మీరు కరోనా రోగి దగ్గర పనిచేయలేదు కదా?’ అంటూ కంటిన్యూగా వారితో పని చేయించారు. అయితే రోగి దగ్గరే పని చేయాలనే నిబంధన లేదు. కొవిడ్‌ ఆస్పత్రిలో రెండు వారాలు పనిచేస్తే...ఆ తరువాత రెండు వారాలు ఆ వైద్యుడు క్వారంటైన్‌లో ఉండాలి. కానీ మెడికల్‌ కాలేజీ పెద్దలు ఆ విధానం పాటించలేదు. అయినప్పటికీ కాలేజీకి చెందిన వైద్యులు (టీచింగ్‌ స్టాఫ్‌), జూడాలు సర్దుకుపోయారు.


ఎల్‌జీ పాలిమర్స్‌ డ్యూటీ అంటూ...

తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాద బాధిత గ్రామాల్లో వైద్యం చేయడానికి వెళ్లండంటూ వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లలో పని చేసేందుకు ఆంధ్రా మెడికల్‌ కళాశాలకు చెందిన 40 మందిని (వైద్య విద్యార్థులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు), మరో 20 మంది కంటి వైద్యులను నియమించారు. వీరిలో అధికశాతం మంది కొవిడ్‌ వైద్య సేవల్లో పాల్గొన్నారు. మళ్లీ ఇప్పుడు పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో వైద్య సేవలకు పంపడంపై వారు నిరసన వ్యక్తంచేశారు. ఆ గ్రామాల చుట్టుపక్కల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో వైద్యులు వుండగా, తమను అక్కడకు పంపించడం ఏమిటని వారు ప్రశ్నించారు.


కేజీహెచ్‌లో పనిచేసే 90 మంది వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది ఇప్పటికే కరోనా విధుల్లో ఉన్నారని, ఇప్పుడు తాము కూడా బయటకు వెళితే...కేజీహెచ్‌కు వచ్చే అత్యవసర కేసులు ఎవరూ చూస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రజారోగ్య విభాగం ఉంది. వైద్య విధాన పరిషత్‌ ఉంది. వాటికి చెందిన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో సుమారు 300 మంది వైద్యులు గోపాలపట్నం పరిసర గ్రామాల్లో ఉన్నారు. పాలిమర్స్‌ బాధితులకు సేవలు అందించడానికి వారు సరిపోతారని, అయితే ప్రభుత్వ పెద్దల దగ్గర మెప్పు కోసం చదువుకోవడానికి వచ్చిన తమకు ఇష్టానుసారంగా డ్యూటీలు వేస్తున్నారని జూడాలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రశ్నించిందనుకు ఓ జూడాకు మెమో ఇచ్చారని సర్జరీ విభాగానికి చెందిన ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 


సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు

పాలిమర్స్‌ బాధిత గ్రామాలకు వెళ్లాలని తమకు ఆదేశాలు ఇచ్చారంటూ పీజీలు, వైద్యులు 40 మంది కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌కు ప్రిన్సిపాల్‌ సుధాకర్‌పై ఫిర్యాదు చేశారు. దీనిపై తనకు కనీసం సమాచారం కూడా లేదని సూపరింటెండెంట్‌ పేర్కొనడం గమనార్హం. పరిపాలన అధికారికి తెలియకుండా వైద్యులను ఇలా పంపడం ఏమిటంటూ ఆసుపత్రిలో తీవ్ర చర్చ సాగుతోంది. 


ప్రైవేటు సంస్థపై ప్రేమ ఎందుకు..?

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రైవేటు సంస్థ. వారి నిర్లక్ష్యం వల్ల ఐదు గ్రామాల ప్రజలు భారీగా నష్టపోయారు. వారికి చికిత్స అందించాల్సిన బాధ్యత ఆ కంపెనీది. అత్యవసర సేవలన్నీ కేజీహెచ్‌లో అందించామని, ఇప్పుడు వారికి వ్యక్తిగతంగా ఏమైనా కావాలంటే...వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు ఉన్నాయని, లేదంటే.. కంపెనీ ప్రైవేటు వైద్యులను తీసుకువచ్చి పరీక్షలు చేయించేకోవాలే తప్ప కేజీహెచ్‌ వైద్య విద్యార్థులో పనులు చేయించడం ఏమిటని జూడాలు ప్రశ్నిస్తున్నారు. తాము పాలిమర్స్‌ బాధిత గ్రామాలకు వెళ్లబొమని చెబుతున్నారు. 

Updated Date - 2020-05-17T08:35:26+05:30 IST