కొవిడ్ నిబంధనలతో అనంతుని దీపోత్సవం
ABN , First Publish Date - 2020-12-12T04:27:40+05:30 IST
ఈనెల 14న నిర్వహించే అనంత పద్మనాభుని దీపోత్సవం కొవిడ్ నిబంధనల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని జేసీ-3, దీపోత్సవం నోడల్ అధికారి గోవిందరావు స్పష్టం చేశారు.
1300 మంది వలంటీర్లతో నిర్వహణ
భక్తులకు అనుమతి లేదు
జేసీ -3 గోవిందరావు
పద్మనాభం, డిసెంబరు11: ఈనెల 14న నిర్వహించే అనంత పద్మనాభుని దీపోత్సవం కొవిడ్ నిబంధనల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని జేసీ-3, దీపోత్సవం నోడల్ అధికారి గోవిందరావు స్పష్టం చేశారు. స్థానిక సామాజిక భవనంలో ఉత్సవ నిర్వహణపై వివిధశాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం కరోనా రెండోదశలో ఉన్నందున దీపోత్సవాన్ని వలంటీర్లతోనే నిర్వహిస్తామన్నారు. భక్తులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. భక్తులకు అనుమతి లేదనే విషయాన్ని విశాఖ, విజయనగరం జిల్లాలో ఆటోల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని దేవదాయ, ఇతరశాఖల అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.
నార్త్‌జోన్ ఏసీపీ ఆర్.రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ దీపోత్సవం రోజున అన్ని రోడ్లలో రెండంచెల బారికేడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. తమ వారికి అనుమతి ఇవ్వాలంటూ అధికారులు, నాయకులు పోలీసులపై ఒత్తిడి తేవద్దని కోరారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.లక్ష్మీనారాయణశాస్త్రి మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వైదిక సంప్రదాయాల మేరకు ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీఐ ఎ.విశ్వేశ్వరరావు, సింహాచలం దేవస్థానం పర్యవేక్షకులు రాజేంద్ర, ఏవో పి.రాధ, ఈవోఆర్డీ ఉషారాణి మండల వైసీపీ అధ్యక్షుడు కె.రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు టి.పద్దు, బి.సత్యనారాయణ, టి.పైడిరాజు ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.