త్రిశంకుస్వర్గంలో ‘టిడ్కో’ లబ్దిదారులు
ABN , First Publish Date - 2020-10-28T16:04:26+05:30 IST
వైసీపీ ప్రభుత్వ తీరుతో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి త్రిశంకుస్వర్గంలో పడింది. గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను..

అనకాపల్లిలో చేపట్టిన ఇళ్ల పనులు చాలావరకూ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి
మిగిలిన పనులు పూర్తిచేయని వైసీపీ ప్రభుత్వం
అధికారుల భిన్న ప్రకటనలతో అయోమయం
పట్టాలను రద్దు చేసే ప్రతిపాదన లేదంటున్న జీవీఎంసీ జోనల్ కమిషనర్
కాదు...పట్టాలన్నీ రద్దు అయినట్టేనంటున్న మెప్మా పీడీ
విశాఖపట్నం/అనకాపల్లి: వైసీపీ ప్రభుత్వ తీరుతో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి త్రిశంకుస్వర్గంలో పడింది. గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను రద్దు చేసి కొత్తగా డ్రా తీస్తామని ఒకసారి, కాదు...లబ్ధిదారులందరికీ ఇళ్లు కేటాయిస్తామని మరోసారి చెబుతుండడంతో నిరుపేదల్లో అయోమయం నెలకొంది. టీడీపీ హయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లు కేటాయించాల్సిందేనని, లేకపోతే ఆందోళనలు చేస్తామని ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.
అనకాపల్లిలో నిలిచిపోయిన పనులు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు సొంత గూడు కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో అనకాపల్లిలో జీ ప్లస్ త్రీ తరహాలో గ్రూపుహౌస్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు ఏడు వేల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 4,500 మందిని అర్హులుగా తేల్చారు. వీరికోసం సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలో 2,520 సింగిల్ బెడ్రూమ్, 320 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, కొప్పాకలో 506 సింగిల్ బెడ్ రూమ్, సిరసపల్లిలో 432 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. వీటిల్లో చాలావరకు 80 శాతం పైబడి పనులు పూర్తయ్యాయి. ఆయా లబ్ధిదారులకు హక్కు పత్రాలను కూడా మంజూరుచేశారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి పనులు చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. గత 16 నెలల నుంచి ఎటువంటి పనులు చేయలేదు. సత్యనారాయణపురంలో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి పలువురు లబ్ధిదారులు టీడీపీ హయాంలోనే గృహ ప్రవేశాలు కూడా చేశారు. తాగునీరు, రహదారులు లేకపోవడంతో కొత్త ఇళ్లల్లోకి మారలేదు. అప్పటికి సుమారు 1900 ఇళ్లకు విద్యుత్ మీటర్లు బిగించగా, 600 ఇళ్లకు కనెక్షన్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి లబ్ధిదారులు ప్రతి నెలా కనీస విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు ఇటీవల విద్యుత్ అధికారులను కలిసి, టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి విద్యుత్ బిల్లులు తీసుకోవద్దని హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఆ ఆదేశాల ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని లబ్ధిదారులు అంటున్నారు.
పొంతన లేని అధికారుల ప్రకటనలు
‘‘అనకాపల్లిలో అర్హులైన వారందరికీ టిడ్కో ఇళ్లు ఇస్తాం. గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసే ప్రతిపాదన లేదు. పాత లబ్ధిదారులకు కేటాయించగా...మరో వెయ్యి ఇళ్ల వరకు వివిధ దశల్లో ఉన్నాయి. అర్హులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఇళ్లు ఇస్తాం’’ అని జీవీఎంసీ జోనల్ కమిషనర్ పి.వి. శ్రీరామ్మూర్తి చెప్పారు. అయితే మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి.రమేశ్ మాత్రం...గతంలో ఇచ్చిన టిడ్కో ఇళ్ల పట్టాలన్నీ రద్దు చేస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారని, అందువల్ల మళ్లీ అందరూ దరఖాస్తు చేసుకోవాలని, వారిలో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని చెబుతున్నారు.
పరవాడలో నిలిచిపోయిన నిర్మాణాలు
పరవాడ: పరవాడలోని జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయం పక్కనే ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో 512 గృహాలను నిర్మించేందుకు 2017లో అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది. ఒక్కో లబ్ధిదారుడు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు డీడీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్కు సుమారు రూ.3 కోట్లు చెల్లించాల్సి వుందని టిడ్కో ఈఈ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇక ఇ-బోనంగి, పరవాడ రెవెన్యూ పరిధిలో కొన్ని తుది దశకు చేరుకోగా మరికొన్ని నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి.
పునాదుల్లోనే మంత్రిపాలెం ఇళ్లు
లంకెలపాలెం: గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 85వ వార్డు పరిధిలోని మంత్రిపాలెం వద్ద ఏడు బ్లాకుల్లో 336 ఇళ్ల నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో టాటా సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. జీ ప్లస్- 3 తరహాలో చేపట్టిన ఈ పనులను వైసీపీ అధికారంలోకి రాగానే నిలిపివేసింది. ప్రస్తుతం ఏడు బ్లాకులకు గాను ఒక్క బ్లాకు మాత్రమే నిర్మాణం పూర్తి కాగా, ఆరు బ్లాకులు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. రీటెండరింగ్లో టాటా సంస్థకు కాంట్రాక్టు దక్కినప్పటికీ, బిల్లుల చెల్లింపు కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.
ఎలమంచిలిలో 80 మంది పేర్లు తొలగింపు
ఎలమంచిలి: ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలో ఇళ్లు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వం జాతీయ రహదారి పక్కన రామ్నగర్ సమీపంలో జీ ప్లస్ త్రీ తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అందిన దరఖాస్తుదారుల్లో 608 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. గత ఏడాది ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు 25 శాతంలోపు నిర్మాణం జరిగిన ఇళ్ల పనులను ఆపేశారు. అప్పటికి 432 ఫ్లాట్లు పనులు 25 శాతం కంటే ఎక్కువ అయ్యాయి. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితాలను మరోసారి వడపోత పోశారు. ఇందులో 80 మందిని అనర్హులుగా తేల్చారు. మిగిలిన 528 మంది అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదించారు. టిడ్కో హౌసింగ్ కాలనీలో 432 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. 528 మందిలో ఎవరికి టిడ్కో ఇళ్లు కేటాయించాలన్నది ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని మునిసిపల్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు.
విశాఖ నగరంలో
లబ్ధిదారులు సగానికి కుదింపు
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఇళ్ల కోసం 3,84,872 మంది దరఖాస్తు చేసుకొన్నారు. అప్పటి ప్రభుత్వం..43,844 మందిని అర్హులుగా తేల్చి...తొలి దశలో 28,152 ఇళ్లకు టెండర్లు ఖరారు చేసింది.
ఇందులో 25,080 ఇళ్ల నిర్మాణం 2018లో ప్రారంభమైంది. రమారమి 11 వేల ఇళ్లకు సంబంధించి మూడో అంతస్తు
వరకు శ్లాబ్లు వేశారు. లబ్ధిదారులు డీడీలు తీసి జీవీఎంసీ యూసీడీ అధికారులకు అందజేశారు. ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. గత ఆగస్టులో టిడ్కో గృహాలపై మరోసారి సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. మొదట ఎంపిక చేసిన 43,844
మందిలో 28 వేల మంది మాత్రమే అర్హులుగా అధికారులు తేల్చారు. అయితే 25,080 ఇళ్లు మాత్రమే అందుబాటులో వుండడంతో డీడీలు కట్టినవారిలో మూడువేలమందిని పక్కనపెట్టనున్నారు. త్వరలో పంపిణీ
చేసే పేదింటి ఇళ్ల స్థలాల్లో ఇలాంటి వారికి న్యాయం చేస్తామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.