-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » AITUC
-
శ్రమజీవుల పోరాట చరిత్ర అజరామరం
ABN , First Publish Date - 2020-11-01T05:08:20+05:30 IST
దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన చరిత్ర ఏఐటీయూసీదని, కార్మికుల కోసం పోరాడి ఎన్నో చట్టాలు సాధించుకున్న ఘనత కూడా ఏఐటీయూసీ దక్కించుకుందని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వి.వి.రామారావు అన్నారు.

ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాల్లో జాతీయ ఉపాధ్యక్షుడు రామారావు
సీతమ్మధార, అక్టోబరు 31: దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన చరిత్ర ఏఐటీయూసీదని, కార్మికుల కోసం పోరాడి ఎన్నో చట్టాలు సాధించుకున్న ఘనత కూడా ఏఐటీయూసీ దక్కించుకుందని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వి.వి.రామారావు అన్నారు. దేశంలో తొలికార్మిక సంఘంగా గుర్తింపు పొందిన ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నగరంలో భారీ ర్యాలీ, అనంతరం సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సీతమ్మధార కూడలిలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఏఐటీయూసీ పతాకాన్ని రామారావు ఎగరవేశారు. అనంతరం వి.వి.రామారావు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కోడ్‌లుగా మార్చేసి కార్మికులను దోచుకునేందుకు కుయుక్తులు పన్నుతోందన్నారు. యజమానులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ అంబానీ, ఆదానీ, వేదాంత వంటి పారిశ్రామిక అధిపతులకు ఊడిగం చేస్తూ భారతదేశ ఆర్థిక, స్వాతంత్య్ర స్వావలంబనకు తీవ్రద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం కూడా కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబు బాటలోనే నడుస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల్లో పనిచేసే సాక్షరభారత్ ఉద్యోగులను తొలగించారని, ఇతర స్కీముల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పనిభద్రత, కనీస వేతనం అమలు కావడం లేదన్నారు. అనంతరం బైక్ ర్యాలీని వి.వి.రామారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు కోట సత్తిబాబు, కె.వి.తిలక్, పడాల గోవింద్, పి.వీర్రాజు, ఆనంద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.