మీటర్లపై ముందుకే...
ABN , First Publish Date - 2020-11-03T05:30:00+05:30 IST
వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మీటర్ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించింది.ఈ ప్రక్రియను న్యాయ సమీక్షకు పంపింది.
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు
ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
టెండర్లు ఆహ్వానం
ఈ నెల 11 వరకు అభ్యంతరాల స్వీకారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మీటర్ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించింది.ఈ ప్రక్రియను న్యాయ సమీక్షకు పంపింది. ఆ వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వాటిపై ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు వుంటే బుధవారం నుంచి ఈ నెల 11వ తేదీలోగా సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ నాగలక్ష్మి సూచించారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తరువాత పనులు చేపడతామని ఆమె మంగళవారం తెలిపారు.
రైతులకు ఇప్పటివరకు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్రం చెప్పిందంటూ స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులతో పాటు విపక్ష నేతలు ఈ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకువెళుతోంది. ఈ క్రమంలోనే ఈపీడీసీఎల్ పరిధిలో గల ఐదు జిల్లాల కోసం రూ.100 కోట్ల వ్యయంతో స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లకు టెండర్లను ఆహ్వానించింది. దీనిపై ఇప్పుడు న్యాయ సమీక్ష జరుగుతోంది. ఈపీడీసీఎల్ పరిధిలో 2.39 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి దశల వారీగా స్మార్ట్ మీటర్లను అమర్చనున్నట్టు అధికారులు చెబుతున్నారు. రైతులు ఎన్ని యూనిట్లు విద్యుత్ వినియోగించారో చూసి...ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఆ మొత్తం వెంటనే డిస్కమ్ ఖాతాకు బదిలీ అయిపోతుందంటున్నారు. అయితే దశల వారీగా ఉచిత విద్యుత్ నిలిపివేసి, బిల్లులు కట్టమంటారేమోనని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయవద్దని కోరుతున్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. ఠీఠీఠీ.్జఠఛీజీఛిజ్చీజూఞట్ఛఠిజ్ఛీఠీ.్చఞ.జౌఠి.జీుఽ