మార్చి నాటికి అగ్రి ల్యాబ్‌ నిర్మాణం పూర్తి కావాలి

ABN , First Publish Date - 2020-11-22T04:04:51+05:30 IST

సబ్బవరం సర్వే నంబరు 271లో రూ.3.13 కోట్లతో చేపట్టిన జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ నిర్మాణ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని జిల్లా అధికారులను వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఆదేశించారు.

మార్చి నాటికి అగ్రి ల్యాబ్‌ నిర్మాణం పూర్తి కావాలి
వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌

అధికారులకు వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశం


సబ్బవరం, నవంబరు 21 : సబ్బవరం సర్వే నంబరు 271లో రూ.3.13 కోట్లతో చేపట్టిన జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ నిర్మాణ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని జిల్లా అధికారులను వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం ఆయన అగ్రి ల్యాబ్‌ నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ జేడీ లీలావతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ల్యాబ్స్‌ 13 జిల్లాల్లో 13 నిర్మాణంలో ఉన్నాయన్నారు. నియోజకవర్గం స్థాయిలో అవసరమైన చోట రాష్ట్రంలో 175 నియోజకవర్గాల పరిధిలో 147 ల్యాబ్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. అగ్రి ల్యాబ్స్‌ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందడమే కాకుండా రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్స్‌ అందించనున్నామన్నారు. పంటల నాణ్యత పరిశీలన, మట్టి నమూనాల పరిశీలన ఇక్కడే జరుగుతాయన్నారు. విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో 8 అగ్రి ల్యాబ్స్‌ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. అగ్రి ల్యాబ్స్‌కు కేటాయించిన స్థలం 4.94 ఎకరాల్లో కొంత ఆక్రమణకు గురైనట్టు స్థానిక అధికారులు కమిషనర్‌ దృష్టికి తీసుకురాగా కలెక్టర్‌, జేసీల దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. ఫెన్సింగ్‌ వేసి రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్థానిక అధికారులు తీసుకోవాలని సూచించారు. అగ్రి ల్యాబ్‌కు వెళ్లే అప్రోచ్‌ రోడ్డు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సబ్బవరం- చోడవరం రోడ్డు నుంచి అగ్రీ ల్యాబ్‌కు మార్గం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌, జేసీ దృష్టికి తీసుకు వెళతానని తెలిపారు. ఆయన వెంట పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఈఈ కె. తిరుపతిరావు, ఏడీ కోటేశ్వరరావు, ఏవో పోతల సత్యనారాయణ, ఏఈవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-22T04:04:51+05:30 IST