శరవేగంగా అగ్రి ల్యాబ్‌ నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2020-12-13T05:42:07+05:30 IST

సబ్బవరంలో రూ.3.13 కోట్లతో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.

శరవేగంగా అగ్రి ల్యాబ్‌ నిర్మాణ పనులు
అగ్రి ల్యాబ్‌ నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం

5 ఎకరాల్లో రూ.3.13 కోట్లతో నిర్మాణం

ఉచితంగా మట్టి, ఎరువులు, విత్తనాల నాణ్యత పరీక్షలు

వచ్చే ఖరీఫ్‌ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు


సబ్బవరం, డిసెంబరు 12 : సబ్బవరంలో రూ.3.13 కోట్లతో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో సబ్బవరం సర్వే నంబరు 271లో అగ్రి ల్యాబ్‌కు ఐదు ఎకరాల స్థలం కేటాయించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రూ.3.13 కోట్లు మంజూరు చేసింది. అన్ని హంగులతో వచ్చే ఖరీఫ్‌కు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పంటల సాగులో రైతులకు మరిన్ని సూచనలు, సలహాలు అందజేయడానికి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సమీకృత వ్యవసాయ ప్రయోగశాల, జిల్లా మొత్తానికి ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మేరకు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సమీకృత ప్రయోగశాలలు నెలకొల్పడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ కేంద్రాల్లో పురుగుల మందులు, ఎరువులు, విత్తనాల నాణ్యతను నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఎండాడలో ఉన్న వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో ఉన్న పురుగుల మందుల నాణ్యత ప్రయోగశాలను సబ్బవరంలో ఏర్పాటు చేయనున్న జిల్లా ప్రయోగశాలకు తరలిస్తారు. ప్రయోగశాల భవన నిర్మాణ బాధ్యతను రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కల్లా ప్రయోగశాల అందుబాటులోకి వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అగ్రి ల్యాబ్‌లో మట్టి నమూనా, ఎరువులు, విత్తనాలను ఉచితంగా పరీక్షిస్తారు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా ఏ రకం పంటలు సాగు చేయడానికి పొలం అనుకూలంగా ఉందో తెలుసుకునేందుకు వీలవుతుంది. ప్రతీ రైతు తన భూమికి సంబంధించిన మట్టి నమూనాలను పరీక్షించుకునేలా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే పనిని ఇటీవల కొత్తగా నియమించిన వ్యవసాయ అసిస్టెంట్లకు అప్పగించనున్నారు. వ్యాపారులు విక్రయించే ఎరువులు, విత్తనాల నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షిస్తారు. నిర్దేశించిన ప్రమాణాల్లో లేకపోతే ఆయా సంస్థలు లేదా కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు.


అగ్రి ల్యాబ్‌ వల్ల రైతులకు ఎంతో మేలు 

సబ్బవరంలో అగ్రి ల్యాబ్‌ నిర్మాణం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అగ్రి ల్యాబ్‌ నిర్మాణం చేపడుతోంది. రైతులు తమ భూములకు సంబంధించి మట్టి నమూనాలను నేరుగా ప్రయోగశాలకు తీసుకెళ్లి స్వయంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఎరువుల డీలర్ల ఆగడాలను అరికట్టేందుకు వీలవుతుంది. వచ్చే ఖరీఫ్‌కు అగ్రి ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

- పోతల సత్యనారాయణ, వ్యవసాయాధికారి, సబ్బవరం


Updated Date - 2020-12-13T05:42:07+05:30 IST