ఏలూరు ఘటనతో విశాఖలో అలర్ట్.. ఎప్పటికప్పుడు తాగునీటి స్వచ్ఛతను పరీక్షించేలా..
ABN , First Publish Date - 2020-12-10T06:17:22+05:30 IST
ఏలూరు ఘటన నేపథ్యంలో గ్రేటర్ విశాఖ ముని సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు అప్రమత్తమయ్యారు.

అప్రమత్తమైన జీవీఎంసీ
తాగునీటి స్వచ్ఛతపై పరీక్షలు
ప్రతిరోజూ 1650 శాంపిల్స్ సేకరణ
రిజర్వాయర్లతోపాటు కొళాయి పాయింట్ల తనిఖీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఏలూరు ఘటన నేపథ్యంలో గ్రేటర్ విశాఖ ముని సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో సరఫరా చేస్తున్న తాగునీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరీక్షించేలా చర్యలు ప్రారంభించారు.
నగర పరిధిలో నివాసముంటున్న సుమారు 25 లక్షల మందికి ప్రతిరోజూ 50 మిలియన్ గాలన్లు (ఎంజీడీ) నీటిని జీవీఎంసీ సరఫరా చేస్తోంది. ఏలేరు, రైవాడ, తాటిపూడి, మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ రిజర్వాయర్ల నుంచి నీటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తుంది. అక్కడ నీటిని ఫ్రీ రిజెడ్యుల్ క్లోరిన్ (ఎఫ్‌ఆర్‌సీ) ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి తాగడానికి అనువుగా మార్చిన తర్వాత కొళాయిలకు సరఫరా చేస్తుం ది. జలాశయాల నుంచి నగరంలోని రిజర్వాయర్లకు నీరు చేరే సమయంలో ఎక్కడైనా కలుషితమైనప్పటికీ ఎఫ్‌ఆర్‌సీ ద్వారా అందులో వున్న సూక్ష్మజీవులు, ఇతర భారలోహాలను నశింపజేసేందుకు అవకాశం ఉంది. అయితే అక్కడి నుంచి నీరు కొళాయి పాయింట్‌కు చేరే క్రమంలో కలుషితమయ్యేందుకు ఆస్కారం ఉంది. నగరంలో నీటి సరఫరా పైప్‌లైన్‌లు డ్రైనేజీలు, యూజీడీ పైప్‌లైన్లు, గెడ్డల మధ్యలో నుంచి వుండడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. కలుషితమైన నీటిని తాగడం వల్ల ప్రజలు డయేరియా, మూర్చ, తల, కళ్లు తిరగడం వంటి రుగ్మతలకు గురికావాల్సి ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూ రులో వందలాది మంది అంతుచిక్కనివ్యాధి లక్షణాలకు గురికావడానికి ఇలాంటి పరిస్థితే కారణమై వుంటుందని నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు.
ప్రతిరోజూ 1,650 నమూనాల సేకరణ
నగరంలో సరఫరా అవుతున్న నీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు ప్రతిరోజూ 1,650 శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు. నగరానికి తాగునీరు అందించే రిజర్వాయర్లతోపాటు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో నిర్మించిన వ్యక్తిగత రిజర్వాయర్లు, వివిధ ప్రాంతాల్లో కొళాయి పాయింట్ల వద్ద ఈ శాంపిల్స్ సేకరిస్తున్నారు. వీటిలో జీవీఎంసీ నీటి సరఫరా విభాగం 750, జీవీఎంసీ టెండరు ద్వారా నియమించిన బీఎస్ కెమికల్స్ ఏజెన్సీ 900 వరకూ శాంపిల్స్ సేకరిస్తున్నాయి. సరఫరా అవుతున్న నీటిలో క్లోరిన్ శాతం నిర్దేశిత స్థాయిలో ఉందా?, లేదా?...నీటిలో ఏవైనా భారలోహాలు కలిశాయా?, సూక్షజీవులు అవశేషాలు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా అనుమానం కలిగించేలా నివేదిక వస్తే ఆ పాయింట్‌కు నీటిని సరఫరా చేసే రిజర్వాయర్ నుంచి పంపిణీ నిలిపివేస్తామని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ ఎస్.వేణుగోపాల్ తెలిపారు. నగరంలో నీటి స్వచ్ఛత విషయంలో అప్రమత్తంగా వుండడంతోపాటు పైప్‌లైన్లు లీకేజీలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు.