జీవీఎంసీ ఆన్‌లైన్‌ గ్రీవెన్స్‌కి 495 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2020-07-19T10:05:41+05:30 IST

జీవీఎంసీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌

జీవీఎంసీ ఆన్‌లైన్‌ గ్రీవెన్స్‌కి 495 ఫిర్యాదులు

విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన శనివారం నిర్వహించిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఇతర సోషల్‌ మీడియా ద్వారా గ్రీవెన్స్‌ స్వీకరణ కార్యక్రమానికి 495 ఫిర్యాదులు అందాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం లేకుండాపోయింది. దీంతో కమిషనర్‌ ప్రజల సమస్యలతోపాటు కొవిడ్‌-19, సీజనల్‌ జ్వరాల నియంత్రణకు ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలు స్వీకరించేందుకు వీలుగా శనివారం ఉదయం పది నుంచి 11 గంటల వరకూ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా ప్రజల నుంచి గ్రీవెన్స్‌ స్వీకరించారు.


ఈ సందర్భంగా పట్టణ పరిధిలో వీధి దీపాల సమస్యలపై స్పందిస్తూ, వాటిని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్లు, కాలువలు వంటి మౌలిక వసతుల కల్పనపై కొంతమంది ప్రస్తావించగా, కార్పొరేషన్‌ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మౌలికవసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ తెలిపారు. ఆస్తిపన్ను అంశంపై స్పందిస్తూ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు. అసెస్‌మెంట్‌ల కోసం సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొవిడ్‌-19పై కొంతమంది ప్రస్తావించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా గృహనిర్బంధం, ఐసోలేషన్‌, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చేవారికి సంబంధించిన ప్రొటోకాల్‌ నిబంధనలపై ప్రతీ ఒక్కరికి వివరిస్తున్నామన్నారు.


ఇళ్ల పథకానికి సంబంధించి కొంతమంది ప్రస్తావిస్తూ, గతంలో అర్హత పొందిన తమకు ఇప్పుడు అర్హుల జాబితాలో చోటు కల్పించకపోవడానికి గల కారణాలపై ప్రశ్నించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హుల జాబితాలపై పునఃపరిశీలన చేసి  న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-07-19T10:05:41+05:30 IST