వాహనాలు పెంపు, సిబ్బంది తగ్గింపు!

ABN , First Publish Date - 2020-11-19T05:42:11+05:30 IST

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమంటూ మండలానికో 104 వాహనాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం...వాటిల్లో సిబ్బందిని మాత్రం తగ్గించేసింది.

వాహనాలు పెంపు, సిబ్బంది తగ్గింపు!

104 వాహనాల్లో ల్యాబ్‌ టెక్నీషియన్‌,

ఫార్మసిస్టు, ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్స్‌ల తొలగింపు 

కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వారి సేవలకు స్వస్తి

గ్రామాల్లో ఏఎన్‌ఎంలపైనే భారం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమంటూ మండలానికో 104 వాహనాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం...వాటిల్లో సిబ్బందిని మాత్రం తగ్గించేసింది. దాంతో ఆ సేవలన్నీ అందించాల్సిన బాధ్యత ఇప్పుడు గ్రామస్థాయిలో పనిచేసే ఏఎన్‌ఎంలపై పడింది. గతంలో ఒక్కో వాహనంలో డాక్టర్‌, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఏఎన్‌ఎం, వాచ్‌మన్‌, స్టాఫ్‌ నర్స్‌ ఉండేవారు. కొత్తగా వచ్చిన వాహనాల్లో డాక్టర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, డ్రైవర్‌ మాత్రమే ఉంటున్నారు. గ్రామాల్లోకి వాహనం వెళ్లినప్పుడు రోగులను పరీక్షించడం, మందులు రాయడం వంటి పనులను డాక్టర్‌ చేస్తే, వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చే బాధ్యతను డేటా ఎంట్రీ ఆపరేటర్‌ చూస్తున్నారు. అయితే అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించడం, మందులను అందించడం వంటి బాధ్యతలను గతంలో ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ చేసేవారు. ఇప్పుడు వారిని తొలగించేయడంతో ఆ పనులను స్థానికంగా వుండే ఏఎన్‌ఎంలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టు వంటి నైపుణ్యం కలిగిన వారి సేవలను ఏఎన్‌ఎంలు అందించడం కొంత ఇబ్బందితో కూడిన వ్యవహారమే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తోంది. ఈ వాహనాల ద్వారా ప్రస్తుతం తొమ్మిది రకాల రక్త పరీక్షలు చేయడంతోపాటు 74 రకాల మందులు అందిస్తున్నారు. వీటితోపాటు ఈసీజీ, షుగర్‌ పరీక్షలను కూడా ఏఎన్‌ఎంలు చేయాల్సి వస్తోంది. నైపుణ్యం కలిగిన సిబ్బంది చేయాల్సిన పనులను ఏఎన్‌ఎంలతో చేయించడం వల్ల ఒక్కోసారి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటున్న పాలకులు వాహనాల సంఖ్య పెంచి నైపుణ్యం కలిగిన సిబ్బందిని తొలగించడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 


హామీ ఏమైంది..?

104 వాహనాల్లో పన్నెండేళ్లుగా పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టు, ఏఎన్‌ఎం, వాచ్‌మన్‌లను వైసీపీ ప్రభుత్వం తొలగించింది. వారి సేవలను పీహెచ్‌సీల్లో వినియోగించుకుంటామని సీఎం జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా...ఇప్పటికీ నెరవేర్చలేదని ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వారంతా కొన్నిరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేయడంతోపాటు అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. వాహనాల్లో తమ సేవలను వినియోగించుకుంటే మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశముంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 


పని ఒత్తిడి లేకుండా సమన్వయం

కె.శ్రీనివాసరావు, జిల్లా మేనేజర్‌

104 వాహనాల ద్వారా జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం 42 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. నెలకొకటి రెండు గ్రామాలకు సేవలు అందిస్తున్నాయి. ఏఎన్‌ఎంలపై పని ఒత్తిడి లేకుండా సమన్వయం చేసుకుంటున్నాం. వాహనంలో వుండే డాక్టర్‌ వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. 


మళ్లీ అవకాశం కల్పించాలి

జయరత్నం, 104 ఉద్యోగుల సంఘ జిల్లా ప్రెసిడెంట్‌

పన్నెండేళ్లుగా 104 వాహనాల్లో పనిచేస్తున్న మమ్మల్ని తొలగించడం దారుణం. పీహెచ్‌సీల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దానిని నిలబెట్టుకోవాలి. వాహనాలలో సేవలు అందించడానికి తీసుకుంటే బాగుంటుంది. మండలానికో వాహనం అందించిన ప్రభుత్వం అంతేస్థాయిలో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించినట్టయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 



Updated Date - 2020-11-19T05:42:11+05:30 IST