మంత్రి ఇలాకాలో రెచ్చిపోతున్న.. ‘చినబాబు’

ABN , First Publish Date - 2020-12-30T17:12:46+05:30 IST

‘ప్రభుత్వ పథకాల అమలులో..

మంత్రి ఇలాకాలో రెచ్చిపోతున్న.. ‘చినబాబు’

పేటలో ‘షాడో’ నేత!

మంత్రి ఇలాకాలో రెచ్చిపోతున్న నాయకుడు

‘చినబాబు’ పేరుతో ఆగడాలు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తున్నాం.. నేను అవినీతికి పాల్పడను. మాలో ఎవరైనా అవినీతికి పాల్పడితే సమాచారం ఇవ్వండి. నాకు తెలిసి ఎవరైనా అధికారులపై ఒత్తిడి తెచ్చినా సహించేది లేదు. జగనన్న పాలనలో అన్ని వర్గాల వారికీ పార్టీలకు అతీతంగా సమన్యాయం జరగాలి’..ఇవీ తరచూ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ మాటలు. కానీ తన నియోజకవర్గంలో కొందరు వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఇందుకు విరుద్ధంగా ఉంది. డిప్యూటీ సీఎం తనయుడి పేరు చెప్పుకొని ఓ చోటా నాయకుడి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఉద్యోగుల బదిలీలు, నియామకాల విషయంలో చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు వస్తున్నా అమాత్యుడు అదంతా మామూలేనంటూ సర్దుకుపోతున్నారు. దీంతో చోటా నాయకుడి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి.

 

అవినీతి ఏఈకి పోస్టింగ్‌

ఓ అవినీతి ఏఈకి పోస్టింగ్‌ విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2010లో పేదలకు ఇళ్ల మంజూరులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా డిమోషన్‌కు గురై సస్పెండ్‌లో ఉన్న ఒక ఏఈని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకొచ్చారు. వాస్తవానికి  ఆ ఏఈపై 2009-10లో గృహాల మంజూరులో భారీగా సొమ్ములు కాజేసినట్లు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఆయనకు ఇప్పట్లో ఉద్యోగం ఇచ్చే అవకాశం లేకపోయినా... వైసీపీ చోటా నేతకు ఏఈ స్వయాన తండ్రి కావడంతో చినబాబు ఒకే చెప్పేశారు. ఇది అదునుగా భావించిన చోటా నేత అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ మళ్లీ ఉద్యోగం ఇప్పించినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో ఏఈగా నియమించేలా తెరవెనుక పావులు కదిపారు. రాజకీయ ఒత్తిడి కారణంగా గృహ నిర్మాణ సంస్థ అధికారులు అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని మళ్లీ ఏఈగా జిల్లా కార్యాలయానికి తెచ్చారు.


మళ్లీ తెరపైకి వివాదం

పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మండలంలో ఇళ్ల స్థలాల కోసం 2,827 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 846 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. గతంలో ఇళ్లు మంజూరైనట్టు రికార్డుల్లో చూపినందునే తాము అనర్హులుగా తేలామని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇందుకు గతంలోని పనిచేసిన గృహనిర్మాణ సంస్థ ఏఈ కారణమని వారు చెబుతున్నారు. మంత్రి తనయుడికి గతంలో ఏఈ చేసిన అవినీతి గురించి ఫిర్యాదు చేసినా...  తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరినా పట్టించుకోలేదని వాపోతున్నారు. చోటా నాయకుడితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా ఇంటి స్థలం మంజూరు కాలేదని మంత్రిని స్వయంగా కలిసి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికైనా   అనుచరుల ఆగడాలపై అమాత్యుడు దృష్టి సారించాల్సిన అవసరముంది.

Updated Date - 2020-12-30T17:12:46+05:30 IST