కొత్త వీసీ ఎవరో?

ABN , First Publish Date - 2020-12-07T04:19:21+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ నూతన వీసీ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ఉపకులపతి ప్రొఫెసర్‌ కూన రాంజీ మూడేళ్ల పదవీ కాలం నేటితో ముగియనుంది. కొత్త వీసీ నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. సెర్చ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 50 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీకి కొత్త వీసీగా ఎవరు వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ఉపకులపతిని నియమిస్తారా? లేదా కొద్దిరోజులు ఇన్‌చార్జి బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తారా? అనే దానిపై చర్చ సాగుతోంది.

కొత్త వీసీ ఎవరో?
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ

 నేడు రిలీవ్‌ కానున్న బీఆర్‌ఏయూ ఉపకులపతి రాంజీ 

 నూతన వైస్‌చాన్స్‌లర్‌ నియామకంపై ఉత్కంఠ

ఎచ్చెర్ల, డిసెంబరు 6: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ నూతన వీసీ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత  ఉపకులపతి  ప్రొఫెసర్‌ కూన రాంజీ మూడేళ్ల పదవీ కాలం నేటితో ముగియనుంది. కొత్త వీసీ నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. సెర్చ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 50 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీకి కొత్త వీసీగా ఎవరు వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ఉపకులపతిని నియమిస్తారా? లేదా కొద్దిరోజులు ఇన్‌చార్జి బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తారా? అనే దానిపై చర్చ సాగుతోంది. ప్రభుత్వం ఈ నెల 2న ముగ్గురి సభ్యులతో కూడిన సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి.. ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. ఈ జాబితాను గవర్నర్‌కు పంపించి, ఇందులో ఒకరిని వీసీగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నవారికే వీసీ పోస్టు వస్తుందనేది బహిరంగ రహస్యం. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి కొద్దిరోజులు పట్టే అవకాశం ఉంది. ఈ లోగా ఇన్‌చార్జి బాధ్యతలను ఎవరికో ఒకరికి అప్పగించే అవకాశముంది. గతంలో ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ జి.నాగేశ్వరరావు మూడేళ్ల పదవీ కాలం పూర్తయితే, అదే వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ప్రసాద్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి, ఆ తర్వాత రెగ్యులర్‌ వీసీగా నియమించారు. ఇదే పద్ధతిని అంబేడ్కర్‌ వర్సిటీకి కూడా అవలంభిస్తారా? లేదా అనేది చర్చనీయాంశమవుతోంది. గతంలో ఏదైనా వర్సిటీలో వీసీ పదవి ఖాళీ అయితే ఆ స్థానంలో సమీప యూనివర్సిటీకి చెందిన వీసీకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే సంప్రదాయం ఉండేది. ఇలాగైతే, ఏయూ వీసీ ప్రొఫెసర్‌ ప్రసాద్‌రెడ్డి కొద్దిరోజుల పాటు అంబేడ్కర్‌ వర్సిటీకి ఇన్‌చార్జి వీసీగా వ్యవహరించే అవకాశం ఉంది. బీఆర్‌ఏయూ సీనియర్‌ ప్రొఫెసర్‌ గుంట తులసీరావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారేమోనన్న వాదన కూడా వినిపిస్తోంది. 2016లో బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్‌ హనుమంతు లజపతిరాయ్‌ మూడేళ్ల పదవీ కాలం పూర్తకావడంతో, అప్పటి రెక్టార్‌ ప్రొఫెసర్‌ మిరియాల చంద్రయ్యను ఇన్‌చార్జి వీసీగా నియమించారు. ఏడాదికి పైగానే ప్రొఫెసర్‌ చంద్రయ్య ఇన్‌చార్జి వీసీగా వ్యవహరించారు. మరోపక్క రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి  బీఆర్‌ఏయూ ఇన్‌చార్జి వీసీ బాధ్యతలు అప్పగించే విషయమై చర్చ జరుగుతోంది. 


 రాంజీ హయాంలో వర్సిటీకి హంగులు :

ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కూన రాంజీని టీడీపీ ప్రభుత్వ హయాంలో (2017 డిసెంబరు) అంబేడ్కర్‌ వర్సిటీకి వీసీగా నియమించారు. ఈయన గతంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా కూడా వ్యవహరించారు. కాగా, వీసీ మూడేళ్ల పదవీ కాలంలో చాలావరకు అంబేడ్కర్‌ వర్సిటీకి కావల్సిన హంగులు సమకూర్చడంలో విజయం సాధించారు. అందరినీ కలుపుకొనిపోయి వర్సిటీని వివిధ అంశాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా వర్సిటీకి 12బీని సాధించడంలో రాంజీ ప్రధాన భూమిక పోషించారు. నాక్‌ గుర్తింపునకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వచ్ఛభారత్‌లో ప్రభుత్వ కళాశాలలు, వర్సిటీల తరఫున దేశంలోనే బీఆర్‌ఏయూకు నాలుగో స్థానం దక్కింది. ఉన్నత భారత్‌ అభియాన్‌ ద్వారా 21 గ్రామాలను వర్సిటీ దత్తత తీసుకుంది. వర్సిటీలో ఇంజనీరింగ్‌ కళాశాలను ప్రారంభించడంతో పాటు ఏఐసీటీఈ గుర్తింపు కూడా లభించింది. వర్సిటీ, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాల కోసం 2018 నుంచి సొంతంగా బీఆర్‌ఏయూ సెట్‌ను నిర్వహిస్తోంది. హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌బిల్లులు తగ్గించేందుకు ఆలా్ట్ర మోడల్‌ కిచెన్‌ను అరంబిందో ఫార్మా సహకారంతో రూ.2కోట్లతో ఏర్పాటు చేశారు. దక్షిణ భారత దేశ స్థాయిలో మహిళా ఖోఖో పోటీలు నిర్వహించారు. వర్సిటీలో రూ.17 కోట్లతో బాలురు హాస్టల్‌, రూ.36 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్‌ భవన నిర్మాణానికి సీపీడబ్ల్యూ అధికారులతో ఒప్పందం కుదిరింది. వర్సిటీలో వివిధ అంశాలపై విద్యార్థుల కోసం 7 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, సీఎస్‌ఐ ఛాప్టర్‌ను ప్రారంభించారు. వర్సిటీలో 17 బోధనా పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల ప్రక్రియను కూడా పూర్తిచేశారు. కోర్టు అభ్యంతరాల కారణంగా నియామకాలు ఆగిపోయాయి. ఎంజీఎన్‌సీఆర్‌ఈ, మలేషియా లింకన్‌ యూనివర్సిటీ, డాకాలోని హమ్మద్‌ యూనస్‌ సోషల్‌ బిజినెస్‌ సెంటర్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు. వర్సిటీలో బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ను బలోపేతం చేశారు. మైక్రో బయాలజీ, యోగా, పీజీ డిప్లమో ఇన్‌ గాంధీయన్‌ అండ్‌ సోషల్‌వర్క్‌ తదితర కోర్సులను ప్రారంభించారు. ఇలా యూనివర్సిటీ అభివృద్ధిలో వీసీ రాంజీ కీలకపాత్ర పోషించి.. నేడు బాధ్యతల నుంచి తప్పుకుని.. ఆంధ్రా యూనివర్సిటీకి రిపోర్టు చేయనున్నారు. 

Read more