పనిచేసిన చోటే.. ప్రాణాలు కోల్పోయి
ABN , First Publish Date - 2020-12-21T04:59:38+05:30 IST
పనిచేసిన చోటే.. ప్రమాదవశాత్తు మిల్లర్ మీద పడడంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో కార్మికుడు మిల్లర్ కేబిన్‌లో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్నాడు. కవిటి మండలం మాణిక్యపురం సమీపంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రోడ్డు పనుల్లో అపశ్రుతి
మిల్లర్ పడి.. కార్మికుడి మృతి
మరొకరి పరిస్థితి విషమం
మాణిక్యపురంలో ఘటన
కవిటి, డిసెంబరు 20 : పనిచేసిన చోటే.. ప్రమాదవశాత్తు మిల్లర్ మీద పడడంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో కార్మికుడు మిల్లర్ కేబిన్‌లో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్నాడు. కవిటి మండలం మాణిక్యపురం సమీపంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సోంపేట-కవిటి-ఈదుపురం(ఎస్‌కెఈ) రోడ్డు పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రోడ్డుకు ఇరువైపులా ఆరు అడుగుల వెడల్పు పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో మాణిక్యపురం-చిన్నబల్లిపుట్టుగ గ్రామాల మధ్యన కాంక్రీట్ మిల్లర్‌తో పనులు చేపడుతుండగా.. ప్రమాదవశాత్తూ మిల్లర్ తిరగబడింది. దీంతో కోటబొమ్మాళి మండలం ఎరకయ్యపేటకు చెందిన మట్ట గంగయ్య(36) అనే కార్మికుడు మిల్లర్ కింద ఇరుక్కుని మృతి చెందాడు. మిల్లర్ కేబిన్‌లో హరిపురానికి చెందిన మరో కార్మికుడు గిరి ఇరుక్కున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ఘటన జరగ్గా.. రెండు ప్రొక్లెయినర్ల సహాయంతో మిల్లర్‌ను తీసే ప్రయత్నం చేశారు. రాత్రి 7 గంటల సమయంలో కేబిన్‌లో ఉన్న గిరిని బయటకు తీసి 108 వాహనంలో సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని కాళ్లు, చేతులు విరిగిపోయాయని స్థానికులు చెబుతున్నారు. సకాలంలో ప్రొక్లెయినర్ వచ్చి సహాయక చర్యలు చేపట్టినట్లయితే ఇంత ప్రమాదం జరిగేది కాదని పేర్కొంటున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ జి.అప్పారావు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.