అరసవల్లిని అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2020-08-16T12:08:46+05:30 IST
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
ఆదిత్యుని దర్శించుకున్న ముగ్గురు మంత్రులు
గుజరాతీపేట, ఆగస్టు 15: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరోనా నుంచి ప్రజలను రక్షించాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని), మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఆదిత్యుని దర్శించుకున్నారు.
అనంతరం మంత్రి నాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. రాజధాని, ఇళ్ల పట్టాల పంపిణీ వంటి సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని తెలిపారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రులకు ఈవో హరిసూర్యప్రకాష్, అర్చకులు వేదమంత్రాలతో ఆహ్వానం పలికారు. ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆశీర్వచనాలను అందజేశారు. కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఆర్డీవో ఎంవీ రమణ, తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, నాయకులు దువ్వాడ శ్రీనివాస్, అంధవరపు సూరిబాబు, ఆలయ కమిటీ సభ్యుడు మండవిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.