టిడ్కో లబ్ధిదారులకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2020-11-14T04:54:03+05:30 IST
టిడ్కో లబ్ధిదారులకు తాము అండగా ఉంటామని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూన రవికుమార్ భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం 4.32 లక్షల ఇళ్లను రద్దు చేసిందని మండిపడ్డారు.
- టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూన రవికుమార్
ఆమదాలవలస, నవంబరు 13: టిడ్కో లబ్ధిదారులకు తాము అండగా ఉంటామని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూన రవికుమార్ భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం 4.32 లక్షల ఇళ్లను రద్దు చేసిందని మండిపడ్డారు. ‘ఇప్పటివరకూ 1.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా.. లబ్ధిదారులకు అందజేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. నాటి లబ్ధిదారులను తొలగించి.. వైసీపీ కార్యకర్తలకు వాటిని కేటాయించేందుకు ప్రయత్నిస్తోంది. ఉదాహరణకు ఆమదాలవలస పట్టణంలోని జగ్గుశాస్ర్తుల పేట వద్ద 523 మంది ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. అనర్హులంటూ 42 మందిని జాబితా నుంచి తొలగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారులకు అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయిస్తాం. అలాగే సుమారు రూ.1500 కోట్ల బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. బిల్లులు తక్షణమే చెల్లించకపోతే ఆందోళన చేస్తా’మని తెలిపారు.
- అవినీతి కోసం తమ్మినేని మాట్లాడడమా?
అవినీతి కోసం నువ్వు మాట్లాడడమా? అంటూ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను ఉద్దేశించి కూన రవికుమార్ వ్యాఖ్యానించారు. అవినీతిపై తమ్మినేని మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పగలరా? అంటూ తమ్మినేనిని ప్రశ్నించారు. అవినీతిపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమేనా? అంటూ సవాల్ విసిరారు. సామాన్యులకు అందుబాటులో లేని ఇసుక.. తమ్మినేని అంతస్తుల నిర్మాణానికి ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ నైజం ప్రజలకు తెలిసిందని.. బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని రవికుమార్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఢిల్లీయాదవ్, పార్టీ నాయకులు నందిజానీ, తవిటయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.