బినామీ రుణాలపై విజిలెన్స్‌!

ABN , First Publish Date - 2020-02-12T09:55:40+05:30 IST

జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే టార్గెట్‌గా విజిలెన్స్‌ తనిఖీలు జరుగుతున్నాయా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత రెండు రోజులుగా

బినామీ రుణాలపై విజిలెన్స్‌!

బీసీ కార్పొరేషన్‌ రుణాలపై ఆరా

టీడీపీ నేతలే లక్ష్యంగా టెక్కలి నియోజకవర్గంలో విచారణ

వైసీపీ కీలక నేత ఫిర్యాదుతో రంగంలోకి అధికారులు

రాజకీయ కక్షతోనే అంటున్న తెలుగు తమ్ముళ్లు


(టెక్కలి)

జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే టార్గెట్‌గా విజిలెన్స్‌ తనిఖీలు జరుగుతున్నాయా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత రెండు రోజులుగా టెక్కలి నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు పార్టీ సానుభూతిపరులైన వ్యాపారులే లక్ష్యంగా చేసుకొని విజిలెన్స్‌ అధికారులు వివరాలను ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా బీసీ కార్పొరేషన్‌ రుణాలను బినామీల పేరిట ముఖ్య నాయకులు, కార్యకర్తలు పొందారన్నదానిపై విచారణ చేపడుతున్నట్టు సమాచారం.  టెక్కలి నియోజకవర్గ వైసీపీ కీలక నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 2014 నుంచి 2019  మధ్యకాలంలో బీసీ కార్పొరేషన్‌ రుణాలు ఎవరెవరు పొందారు వంటి వివరాలను విజిలెన్స్‌ యంత్రాంగం సేకరించింది. ఈ రుణాలకు సంబంధించి కొటేషన్లు అందజేసిన టెక్కలికి చెందిన ఓ వ్యాపారవేత్తను ఇప్పటికే విచారించారు. టెక్కలి మండలానికి సంబంధించి మాజీసర్పంచ్‌ పంగ తవిటయ్య, మాజీ ఎంపీటీసీ పంగ వసంతరావులను తొలివిడతలో విచారించినట్టు తెలుస్తోంది. టెక్కలి, నందిగాం మండలాల టీడీపీ  అధ్యక్షులు బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ మళ్ల బాలకృష్ణ, క్రియాశీలక నాయకులు పోలాకి చంద్రశేఖర్‌, మదన్‌గౌడ, పోలాకి షణ్ముఖరావు, దుక్క రమేష్‌రెడ్డి, వర్తక వాణిజ్య సంఘం అధ్యక్షులు లాడి శ్రీనివాస్‌లను ఇప్పటికే విజిలెన్స్‌ అధికారులు శ్రీకాకుళంలో గల విజిలెన్స్‌ కార్యాలయానికి వచ్చి కోరిన  సమాచారం ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తోంది.


కమిటీ సభ్యులకు కాదని...

వాస్తవానికి మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటుచేసి బీసీ రుణ లబ్ధిదారులను ఎంపికచేశారు. ఈ కమిటీలో అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధులను సభ్యులుగా నియమించారు. కానీ వారిని కాదని టీడీపీ కీలక నాయకులపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఫిర్యాదుపై ఇలా స్పందించడం భావ్యం కాదని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అర్హులకు రుణాలు అందాయే తప్ప నాయకులకు కాదని తేల్చి చెబుతున్నారు. ఇటువంటి కక్షపూరిత పనులు మంచివి కావన్న విషయం గుర్తించుకోవాలని అంటున్నారు.

Updated Date - 2020-02-12T09:55:40+05:30 IST