‘ఉత్తి’ కొనుగోళ్లు!

ABN , First Publish Date - 2020-12-04T05:05:22+05:30 IST

పత్తి రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు. మద్దతు ధర కల్పించేందుకు రాజాంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా.. సీసీఐ నిబంధనల కారణంగా రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.

‘ఉత్తి’ కొనుగోళ్లు!
ప్రత్తి పంట

ప్రారంభానికే పరిమితమైన పత్తి కొనుగోలు కేంద్రం
దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
సీసీఐ నిబంధనలే కారణం
ఏటా నెరవేరని లక్ష్యం
(రాజాం)
జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభానికే పరిమితమవుతోంది తప్ప ఏటా లక్ష్యాన్ని చేరుకోవడం లేదు.  మార్కెట్‌ కన్నా ధర ఎక్కువగా ఉన్నా.. నిబంధనల కారణంగా రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా క్వింటా ధర రూ.5,825 నిర్ణయించినా... రైతులు మొగ్గు చూపడంలేదు. దీంతో సీసీఐ ప్రతినిధులు ఏటా ఆశించిన స్థాయిలో కొనుగోలు చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


పత్తి రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు.  మద్దతు ధర కల్పించేందుకు రాజాంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా.. సీసీఐ నిబంధనల కారణంగా రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని 19 మండలాల్లో  ఏటా  రైతులు 8,782 ఎకరాల్లో పత్తిని పండిస్తుంటారు. ఏడాదికి 61,480 కింటాళ్ల దిగుబడులు వస్తాయి. క్వింటాకు రూ.5,825 చెల్లించాలని నిర్ణయించారు. మొత్తం సీసీఐ ప్రతినిధులు కొనుగోలు చేస్తే రూ.35.81 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఒక్క రాజాంలో మాత్రమే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో మిగిలిన మండలాల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫలితంగా కొనుగోలు లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో తొలిసారి 2015-16లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ 11 మంది రైతుల నుంచి కేవలం 208 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. మొదట్లోనే లక్ష్యం చేరుకోలేని అధికారులు ఆ తర్వాత మూడేళ్ల పాటు ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేకపోయారు. 2019-20లో ప్రారంభించిన తరువాత 134 మంది రైతుల వద్ద 1,791 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఈ ఏడాది గత నెల 29న కొనుగోళ్లు ప్రారంభించగా.. ఇప్పటి వరకూ ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. రాజాంలో కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకెళ్లాలంటే.. రైతులకు రవాణా చార్జీలు తడిసి మోపెడవుతాయి. అష్టకష్టాలు పడి కేంద్రానికి పత్తిని తీసుకొచ్చినా... అధికారులు కొనుగోలు చేస్తారనే నమ్మకం రైతులకు కలగడం లేదు. దీనికి కారణం సీసీఐ పెట్టిన నింబంధనలే. పత్తికాయలు, రంగుమారినా, పత్తి తడిసినా, దుమ్ము,ధూళి, పురుగు పట్టినవి ఉన్నా ఆ పత్తిని సీసీఐ ప్రతినిధులు నాణ్యతాలోపంగా పరిగణిస్తున్నారు. ధర గణనీయంగా తగ్గించడం, పూర్తిగా తిరస్కరించడం వంటివి చేస్తున్నారు. ఒకవేళ కొనుగోలు చేసినా.. రైతుల ఖాతాలకు సకాలంలో నగదు జమకావడం లేదు.  తక్కువ ధర  అయినా.. సకాలంలో నగదు చెల్లిస్తారని... నిబంధనలు పాటించరనే నమ్మకంతో రైతులు దళారులకే పత్తిని విక్రయిస్తున్నారు.


మరో కేంద్రం ఏర్పాటయ్యేనా?
భామిని మండలంలో 4,950 ఎకరాల్లో పత్తిని పండిస్తారు. 35వేల క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి.  మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో ఆ ప్రాంత రైతులు పెదవి విరుస్తున్నారు. అక్కడ నుంచి రాజాం పత్తిని తీసుకురావాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది సీసీఐ క్వింటాల్‌ ధర రూ.5,550 నిర్ణయించినా.. భామిని పరిసరాల్లో దళారులు గరిష్ఠంగా రూ.4,300 మాత్రమే చెల్లించారు. దీంతో చాలామంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. భామినిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కనీసం సీతంపేటలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే.. ఏజెన్సీలోని కొత్తూరు, సీతంపేట, పాలకొండ మండలాల వాసులకు సౌకర్యంగా ఉంటుందని కొందరు రైతులు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో మరొక కేంద్రం ఏర్పాటు చేసేందుకు వసతి సమస్య ఉందని సీసీఐ ప్రతినిధులు చెబుతున్నారు. ఏటా ఇదే కారణం చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కలెక్టర్‌ స్పందించి చర్యలు చేపట్టాలని పత్తి రైతులు కోరుతున్నారు.

రవాణా చార్జీలపై స్పష్టత లేదు
దూర ప్రాంతాల నుంచి  పత్తిని తెచ్చే రైతులకు రవాణా చార్జీల చెల్లింపు విషయంలో స్పష్టత రాలేదు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి. వసతి సమస్య కారణంగా అదనంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేకపోతున్నాం. పత్తి నాణ్యంగా ఉంటేనే రైతులకు మద్దతు ధర దక్కుతుంది.
-ప్రవీణ్‌, సీసీఐ, ప్రతినిధి

ప్రారంభానికే పరిమితం

 ఏటా స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఏర్పాటు చేస్తున్న పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభానికే పరిమితమవుతోంది. కొనుగోలుకు సీసీఐ ప్రతినిధులు కొన్ని నిబంధనలు పెడుతున్నారు. దీంతో పత్తి రైతులు కొనుగోలు కేంద్రాలకు రావడానికి ఇష్టపడడం లేదు. కష్టమైనా, నష్టమైనా దళారులకే విక్రయిస్తున్నారు. ఈవిషయంలో కలెక్టర్‌ చొరవ చూపి.. రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలి.  
-సామంతుల త్రినాఽథనాయుడు, రైతు రాజియ్యపేట

Updated Date - 2020-12-04T05:05:22+05:30 IST