ఇవేం బాధలు!

ABN , First Publish Date - 2020-07-19T12:10:44+05:30 IST

‘సమయానికి టిఫిన్‌ అందించరు. రోజుకో సీ విటమిన్‌ మాత్రతో సరిపెడుతున్నారు. సకాంలో పాలు, వేడినీరు దొరకవు.

ఇవేం బాధలు!

ఐసోలేషన్‌, కొవిడ్‌ ఆస్పత్రిలో 

అంతంతమాత్రంగా వసతులు

ఇబ్బందిపడుతున్న బాధితులు


గుజరాతీపేట, జూలై 18: ‘సమయానికి టిఫిన్‌ అందించరు. రోజుకో సీ విటమిన్‌ మాత్రతో సరిపెడుతున్నారు. సకాంలో పాలు, వేడినీరు దొరకవు. మరుగుదొడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. ఇదేమని అడిగితే క్వారంటైన్‌ రూపంలో మరికొద్దిరోజులు అక్కడ గడపాల్సి ఉంటుంది’... ఇవి ఐసోలేషన్‌ కేంద్రాలతో పాటు జిల్లా కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులు చెబుతున్న బాధలు. జిల్లాలో రాగోలు జెమ్స్‌లో కొవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటుచేయగా....చాలాచోట్ల ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు.


అనుమానిత లక్షణాలు బయటపడితే ఐసోలేషన్‌కు, కాకినాడ ల్యాబ్‌లో పాజిటివ్‌గా నిర్థారణ అయిన వారికి జిల్లా కొవిడ్‌ ఆస్పత్రిలో వైద్యసేవలందిస్తున్నారు. అయితే వసతులు అంతంతమాత్రంగా ఉండడం, కేసుల సంఖ్య పెరుగుతుండడంతో  బాధితులు నరకయాతన పడుతున్నారు. జిల్లా కొవిడ్‌ ఆస్పత్రిలో మరుగుదొడ్ల విషయంలో బాధితులు అసౌకర్యానికి గురవుతున్నారు. నిర్వహణ లేక మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దుర్గంధం వస్తోందని బాధితులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు టిఫిన్‌ అందించాల్సి ఉన్నా.. ఉదయం 9.15 గంటల వరకు బాధితులకు టిఫిన్‌ అందించడం లేదు. నిబంధనల ప్రకారం అందించాల్సిన వేడి నీళ్లు, పాలు బాధితులకు పూర్తిగా చేరడం లేదు.


రోజుకు ఒక సీ విటమిన్‌ మాత్ర తప్ప వేరే గా ఎటువంటి మందులను బాధితులకు అందించడం లేదు. వేడినీటితో ఆవిరి పట్టించడం, ఆయుర్వేదం టీ వంటివి ఇవ్వడం లేదు. బాధితులు ప్రశ్నిస్తే వారిపై పనికట్టుకొని కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. బయటవ్యక్తులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులను గుర్తించి వారిని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఎక్కువ రోజులు ఉంచుతున్నారు. బూర్జ మండలం తోటవాడ గ్రామానికి చెందిన వారిలో అనుమానిత లక్షణాలు కనిపించడంతో సంతబొమ్మాళిలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. మరుగుదొడ్డి ఒకటే కావడంతో బాధితులు ఇబ్బందులకు గురౌతున్నారు. ఇలా అయితే తమ ఆరోగ్య పరిస్ధితి ఏమిటని అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు.


అలా ప్రశ్నించిన వారిని 18 రోజుల పాటు కావాలనే క్వారంటైన్‌లో ఉంచారు. చివరికి ఒక  ప్రజాప్రతినిధి పీఏ జోక్యంతో బుధవారం రాత్రి క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి వారికి విముక్తి కలిగింది.క్వారంటైన్‌ సెంటర్‌లో చేరే వారికి దుప్పటి, టీ షర్టులు, టవల్‌, చిన్నసైజ్‌ సబ్బు, బట్టల సబ్బు, టూత్‌ పేస్టు, బ్రెష్‌ అందించాల్సి ఉన్నప్పటికీ వాటిని అరకొరగా సరఫరా చేస్తున్నారు.

Updated Date - 2020-07-19T12:10:44+05:30 IST