జీతాలు ఎప్పుడో?
ABN , First Publish Date - 2020-08-12T10:29:24+05:30 IST
దశాబ్దాలుగా ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఉద్దానం ప్రాజెక్ట్ సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

ఉద్దానం ప్రాజెక్ట్ సిబ్బందికి ఏడాదిగా అందని వైనం
కుటుంబాలతో ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు
(సోంపేట): దశాబ్దాలుగా ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఉద్దానం ప్రాజెక్ట్ సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అత్తెసరు జీతం కూడా సకాలంలో అందక కుటుంబాలతో ఇక్కట్లు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కరోనా కష్టకాలంలో పస్తులతో గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి వేతనాలు నిలిచిపోయాయని..అధికారులను అడుగుతుంటే సాంకేతిక సమస్య అని చెబుతున్నారని వాపోతున్నారు. సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల పరిధిలో 350 గ్రామాలకు తాగునీరు అందించేందుకు 1999లో ఉద్దానం ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేశారు. ఈ ప్రాజెక్ట్‌లో 123 మంది పనిచేస్తున్నారు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వీరి నియామకాలు జరిగాయి. నెలకు రూ.10 వేల చొప్పున వేతనం అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వీరి వేతనాలు సక్రమంగా అందడం లేదు. నెలల తరబడి వేతన బకాయిలు ఉంటున్నాయి. ఆరు నెలలకోసారి వేతనాలు అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచి వీరి వేతనాలు నిలిచిపోయాయి. దీంతో కుటుంబాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్నా తమకు ఉద్యోగభద్రత లేకుండాపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేదని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ కిందకు తెచ్చినా..తమకు మాత్రం చేర్చకపోవడంపై వారు పెదవి విరుస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్ స్పందనలో సైతం వినతిపత్రం అందించామని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు అందించడంతో పాటు ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని సిబ్బందితో పాటు వారి కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
వారంరోజుల్లో చెల్లిస్తాం..రమేష్‌బాబు, డీఈ, ఉద్దానం ప్రాజెక్ట్
ఉద్దానం ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి త్వరలో వేతనాలు అందిస్తాం. గత కొన్ని నెలలుగా జీతాలు నిలిచిపోయిన మాట వాస్తవమే. సాంకేతిక ఇబ్బందులతోనే నిలిచిపోయాయి. వారం రోజుల్లో వేతనాలు అందించేలా చర్యలు చేపడతాం.