మరో రెండు వారాలు...

ABN , First Publish Date - 2020-05-18T10:42:34+05:30 IST

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పెంచుతూ

మరో రెండు వారాలు...

నేటి నుంచి నాలుగో విడత లాక్‌డౌన్‌ 

ఈ నెల 31 వరకూ కొనసాగింపు


శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి, మే 17 : కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 31 వరకు నాలుగో విడత లాక్‌డౌన్‌ అమలుకానుంది. ఈమేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులను జారీచేసింది. కేంద్ర ఆదేశాలు అనుసరించి కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు అందించనుంది. అందుకు అనుగుణంగా లాక్‌డౌన్‌ను ఏవిధంగా అమలు చేయాలి.. వేటిని సడలించాలి.. వేటికి మినహాయింపులివ్వాలి.. అన్నది కలెక్టర్‌ ప్రకటించనున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముందుగా పాతపట్నంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదవడంతో.. ఆ మండలంలో కొన్ని గ్రామాలను రెడ్‌జోన్‌గా మార్పు చేశారు.


తర్వాత శ్రీకాకుళం పీఎన్‌కాలనీలో ఒక కేసు నమోదు అవ్వడంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఈనెల 25లోగా ఈ ప్రాంతాల్లో ‘పాజిటివ్‌’  కేసులు రాకపోతే.. కంటైన్మెంట్‌ జోన్‌ను ఎత్తివేస్తారు. జిల్లాలో 38 మండలాల్లో కేవలం పాతపట్నాన్ని రెడ్‌జోన్‌గా, సరుబుజ్జిలి, శ్రీకాకుళం ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్‌లో అధికారులు చేర్చారు. ఈ మూడు మండలాల్లో ఆంక్షలు యథావిధిగా కొనసాగనున్నాయి. మిగిలిన మండలాల్లో ‘పాజిటివ్‌’ కేసులు నమోదు కాకపోవడంతో ఆ ప్రాంతాలు ఎప్పటి మాదిరిగానే గ్రీన్‌మండలాల పరిధిలో ఉంటాయి. అత్యవసర సేవలు మినహా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అన్ని ప్రాంతాల్లోనూ 144 సెక్షన్‌ అమలులో  ఉంటుంది. కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉంటుంది.  


ఆంక్షలు.. అలా అలా సడలిస్తూ...

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని కార్యకలాపాలు స్తంభించాయి. అధికారులు క్రమేపీ ఆంక్షలు సడలిస్తూ ప్రజలకు వెసులుబాటు కల్పిస్తున్నారు.  తొలి, రెండో విడత లాక్‌డౌన్‌ సమయంలో కేవలం నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు తప్ప ఇతరత్రా దుకాణాలేవీ తెరుచుకునేవి కావు. మూడో విడత లాక్‌డౌన్‌ అమల్లో కాస్త వెసులుబాటు కల్పించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణాలు తెరుచుకుంటున్నాయి. నిబంధనల మేరకు ఆటోలు తిరుగుతున్నాయి. వ్యవసాయ, ఉపాధి పనులు సైతం సాగుతున్నాయి. కానీ, ప్రజారవాణా వ్యవస్థ.. ఇతరత్రా కార్యకలాపాలు మెరుగుపడ లేదు. నాలుగో విడత లాక్‌డౌన్‌లో అమలుచేయనున్న ఆంక్షలకు సంబంధించి జిల్లా యంత్రాంగం నుంచి ఇంకా ప్రకటన వెలువడాల్సి ఉంది. 

Updated Date - 2020-05-18T10:42:34+05:30 IST