నదీ చెంతనే ఉన్నా...నీటికి చింతే!

ABN , First Publish Date - 2020-03-16T09:26:58+05:30 IST

వంశధార నదీ పరివాహక మండలమైన భామినిలో మైనర్‌ సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేస్తే మెట్ట భూములు సైతం

నదీ చెంతనే ఉన్నా...నీటికి చింతే!

ప్రతిపాదనలకే పరిమితమైన ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు


(భామిని)

వంశధార నదీ పరివాహక మండలమైన భామినిలో మైనర్‌ సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేస్తే మెట్ట భూములు సైతం సస్యశ్యామలమవుతాయి. కానీ దశాబ్దాలుగా వీటి నిర్మాణం ప్రతిపాదనలతో సరిపెడుతున్నారే తప్ప పనులు మాత్రం పట్టాలెక్కించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనా.. తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఆ పనులన్నీ రద్దయ్యాయి. అవి వెనక్కి వెళ్లిపోయాయి. ముఖ్యంగా కొండలోయగెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణం దశాబ్దాల కల.


పుష్కరకాలం కిందట రిజర్వాయర్‌ పనులు ప్రారంభించినా నేటికీ పనులు పూర్తిచేయలేదు. 1000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలన్న లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్టు కనీస సాగునీరు అందించే స్థితిలో లేదు. గత ప్రభుత్వం రూ.9.94 కోట్లు మంజూరు చేయగా పనులు ప్రారంభించకపోవడంతో వైసీపీ ప్రభుత్వం రద్దుచేసింది. బత్తిలి వెర్రిగెడ్డ రిజర్వాయర్‌, వడ్డంగి గజపతిసాగరం, నులకజోడు మామిడిచెరువు, ఘనసర వద్ద కొత్త సాగరం, పెద్దదిమిలిలో డొంగురుగెడ్డ రిజర్వాయర్ల నిర్మాణం ప్రతిపాదనల్లోనే నిలిచిపోయాయి. 


వడ్డంగి గజపతిసాగరానికి వంశధార నీటిని మళ్లించే వీలుగా గత ప్రభుత్వం రూ.33 కోట్లుతో ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసింది. పదుల సంఖ్యలో గ్రామాలకు 7,800 ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం. కాట్రగడలో ఎత్తిపోతల పథకానికి రూ.18 కోట్లతో మంజూరు చేయగా ఈ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. నులకమానుగెడ్డ పథకం పూర్తిగా నిర్వీర్యమైంది.


బత్తిలి వెర్రిగెడ్డ నుంచి బొమ్మిక ఎర్ర చెరువులను కలుపుతూ గొలుసుకట్టుగా నీరందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది.  ప్రత్యేక నీటిపారుదల శాఖ డీఈఈ సుధాకర్‌ వద్ద ప్రస్తావించగాకొండలోయగెడ్డ ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రూ.10 కోట్లు లోపల పనులు కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు.

Updated Date - 2020-03-16T09:26:58+05:30 IST