ఆ పంచాయతీలు మళ్లీ కోర్టుకే..
ABN , First Publish Date - 2020-03-08T10:11:29+05:30 IST
శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విలీనానికి ప్రతిపాదించిన ఏడు పంచాయతీల ప్రజలు, పెద్దలు మళ్లీ

రామలక్ష్మణ జంక్షన్, మార్చి 7: శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విలీనానికి ప్రతిపాదించిన ఏడు పంచాయతీల ప్రజలు, పెద్దలు మళ్లీ హైకోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ మున్సిపల్ శాఖ ఇచ్చిన జీవోపై కోర్టుకు వెళ్లి వ్యతిరేకంగా తీర్పు తెచ్చుకున్న వీరు, ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం అడ్డు పడుతుండటంతో మళ్లీ కోర్టు మెట్లు ఎక్కేందుకు నిర్ణయించారు. కోర్టు తీర్పు తర్వాత కూడా ప్రభుత్వం తమకు అన్ని పంచాయతీల్లాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరపడం లేదని చెబుతున్నారు. ఇందుకు మున్సిపల్ శాఖ నుంచి పంచాయతీ రాజ్ శాఖకు జరుగుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలనే వారు సాక్ష్యంగా చూపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నగరపాలక సంస్థ పరిధిలో ఏడు పంచాయతీలను విలీనం చేసేందుకే చూస్తోందని వారు అనుకుంటున్నారు. మరోవైపు పంచాయతీరాజ్ జిల్లా అధికారులు కూడా ఈ ఏడు పంచాయతీలను వదిలేసి మిగిలిన ఎన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే... ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ఈ ఏడు పంచాయతీల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. దాన్ని పట్టుకునే ఆయా పంచాయతీల పెద్దలు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఒక వేళ మిగతా వారితో పాటు ఈ ఏడు పంచాయతీలకు కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించేస్తే మరో ఐదేళ్ల వరకూ కార్పొరేషన్లకు ఎన్నికలు ఉండవు. అలాంటప్పుడు కార్పొరేషన్ ఎన్నికను వాయిదా వేయడంలో అర్థం లేదు. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినందున, వీరు కోర్టుకు వెళ్లి వచ్చేసరికి ఎన్నికలు ముగిసిపోయే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయకూడదని అక్కడి స్థానిక నాయకత్వం పట్టుబడుతుంటే.. కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం చెబుతోంది.