దొంగలు బాబోయ్‌.. దొంగలు...

ABN , First Publish Date - 2020-12-12T05:15:34+05:30 IST

జిల్లాలో దొంగతనాలు జోరుగా సాగుతున్నాయి. తాళం వేసిన ఇళ్లే కాదు.. ఆలయాలు.. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ చోరీలు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రం పరిధిలో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాకేంద్రం తర్వాత అతిపెద్ద సర్కిల్‌ పోలీస్టేషన్‌, నిత్యం జనాలతో రద్దీగా ఉండే పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో దొంగలు హల్‌చల్‌ చేస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

దొంగలు బాబోయ్‌.. దొంగలు...
శ్రీకాకుళంలో సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న చోరీలు

 భయాందోళన చెందుతున్న ప్రజలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/పలాస)

జిల్లాలో దొంగతనాలు జోరుగా సాగుతున్నాయి. తాళం వేసిన ఇళ్లే కాదు.. ఆలయాలు.. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ చోరీలు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రం పరిధిలో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాకేంద్రం తర్వాత అతిపెద్ద సర్కిల్‌ పోలీస్టేషన్‌, నిత్యం జనాలతో రద్దీగా ఉండే పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో దొంగలు హల్‌చల్‌ చేస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు సవాల్‌ విసురుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమేరాలు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఎటువంటి చోరీలు జరగలేదు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో రైళ్లు, బస్సులు.. తిరుగుతున్నాయి. రవాణా వ్యవస్థ జోరందుకోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కొత్తవ్యక్తులు పట్టణంలో అడుగుపెడుతున్నారని, ఈ క్రమంలో చోరీలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  నిఘా లోపం వల్ల వారిని కనిపెట్టలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల టెక్కలి డివిజన్‌లో దొంగల ముఠా ఒకటి ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి దిగిందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో చోరీల నియంత్రణకు గస్తీ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 


- జిల్లాకేంద్రం పరిధిలో..  :


- అక్టోబర్‌ 25న శ్రీకృష్ణానగర్‌లో(శ్రీకాకుళం రూరల్‌ మండలం పరిధి) రెండో లేఔట్‌లో నివసిస్తున్న చర్చిపాస్టర్‌ ప్రతాప్‌రాజు ఇంట్లో రూ. లక్ష నగదు, బంగారు నక్లెస్‌ అపహరించుకుపోయారు.

-  అక్టోబర్‌ 26న ఎచ్చెర్ల మండలం కమ్మవారిపేట షిర్డీసాయి ఆలయంలో హుండీని దొంగిలించారు. 

-  గత నెల 24న నగరంలోని షిర్డీసాయినగర్‌లో రిటైర్డ్‌ ఉద్యోగి గురుగుబెల్లి సూర్యనారాయణ ఇంట్లో ఏడుతులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 

-  గతనెల 29న శ్రీకాకుళంలో డాక్టర్‌ బమ్మిడి సందీప్‌కుమార్‌ ఇంట్లో పది తులాల వెండి, నగదును దొంగలు అపహరించుకుపోయారు. 

-  తాజాగా.. శుక్రవారం శ్రీకాకుళం పాతహౌసింగ్‌ బోర్డు కాలనీలో ఓ ఇంట్లో చోరీ వెలుగుచూసింది. ఏపీహెచ్‌బీకాలనీలో ఎంఐజీ-3లో వనసాన విశ్వనాథం కుటుంబంతో నివాసముంటున్నారు. కొద్దిరోజుల కిత్రం విశ్వనాథం అయ్యప్ప మాల ధరించారు. భార్యను ఆమె స్వగ్రామమైన లింగాలపాడుకు పంపించేశారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని దొంగలు గుర్తించారు. గురువారం రాత్రి తాళాలను పగులకొట్టి.. బీరువా తలపులను విరగొట్టారు. శుక్రవారం విశ్వనాథం ఇంటికి వచ్చి చూడగా.. చిందరవందరగా సామాన్లు పడి ఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు.. సీఐ అంబేద్కర్‌ సంఘటనా స్థలాన్ని క్లూస్‌ టీంతో పరిశీలించారు. ముప్పావు తులం బంగారు ఆభరణాలు పోయినట్టు గుర్తించారు. ఈ ఘటనపై ఒకటో పట్టణ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేశారు. 


- పలాస మునిసిపాలిటీ పరిధిలో.. : 

-  గత నెల 22న కాశీబుగ్గ సూదికొండకాలనీకి సమీపంలోని ఓ ఇంట్లో దొంగలు దోపిడీ చేశారు. బీరువాలో ఉన్న 25 తులాల బంగారం, రూ.2లక్షల నగదును దొంగిలించారు. రెండురోజుల తరువాత ఈ విషయం బయట పడింది. 

-  గత నెల 24న పలాస పాత జాతీయ రహదారి గరుడఖండి సమీపంలో ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి.. ఓ మహిళ మెడలో రెండున్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. 

- ఈ నెల 8న పలాసలోని ముకుందపండా తోటలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆ ఇంటి ఇలవేల్పు దుర్గాదేవి అమ్మవారికి అలంకరించిన 35 తులాల బంగారు ఆభరణాలు, బీరువా విరగొట్టి రూ.4 లక్షల నగదు దొంగిలించి పరారీ అయ్యారు. 

- ఈ సంఘలన్నింటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నా, ఇప్పటికీ దొంగల ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా దొంగలు మాత్రం పోలీసుల కళ్లుగప్పి పరారీ అవుతుండడం చర్చనీయాంశమవుతోంది. 


 ఎంఈవో కార్యాలయంలో 

రాజాం : బొబ్బిలి రోడ్డులోని మండల విద్యాశాఖ కార్యాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. కార్యాలయం తాళాలను విరగ్గొట్టి రెండున్నర లక్షలు విలువచేసే నాలుగు కంప్యూటర్లు దొంగిలించారు. ఎంఈవో బి.రవి ఫిర్యాదు మేరకు సీఐ పి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ బి.రేవతి, క్రైమ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఆధారాలు సేకరించారు. తాళాలు కూడా దొరకకుండా దొంగలు పట్టుకుపోవడం విశేషం. ఇది తెలిసిన వారిపనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని డీఎస్పీ శ్రావణికి ఫోన్లో వివరించినట్టు సీఐ తెలిపారు. ఇదిలావుంటే వారం రోజుల కిందట నగరపంచాయతీ కార్యాలయంలో దొంగలు చోరీకి ప్రయత్నించి విఫలమైనట్టు కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ తెలిపారు. 


మెట్టపేట ఆలయంలో 

టెక్కలి : లింగాలవలస పంచాయతీ మెట్టపేట శివాలయంలో చోరీ జరిగింది. ఈ ఘటనలో మూడు కేజీల వెండి సామగ్రి దొంగలు పట్టుకుపోయారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ నాయకులు హనుమంతు ఉదయభాస్కర్‌ ఆలయాన్ని సందర్శించి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. హిందూ దేవాలయాల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈయన వెంట మన్మధరావు, పద్మనాభం తదితరులు ఉన్నారు.


నిరంతరం నిఘా

పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో నిరంతరం నిఘా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రజలు ఇళ్లకు తాళం వేసి.. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాకు సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాలు కూడా అమర్చుతాం. చోరీల నియంత్రణపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను కొద్దిరోజుల్లోనే పట్టుకుంటాం. 

 - శంకరరావు, సీఐ, కాశీబుగ్గ

Updated Date - 2020-12-12T05:15:34+05:30 IST