యువకుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-26T05:52:19+05:30 IST

టెక్కలి మేజరు పంచాయతీ నెల్లూరు వీధిలో నివాసముంటున్న పండా శ్రీకాంత్‌(22) అనే యువ కుడు శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

యువకుడు ఆత్మహత్య
శ్రీకాంత్‌(ఫైల్‌)


టెక్కలిరూరల్‌: టెక్కలి మేజరు పంచాయతీ  నెల్లూరు వీధిలో నివాసముంటున్న పండా శ్రీకాంత్‌(22) అనే యువ కుడు శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్‌ పట్టణంలోని ఓ ఫొటో స్డూడియోలో పనిచేస్తున్నాడు. ఈయనకు మూర్చ వ్యాధి ఉంది. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, తాను చనిపోతానని ఇంట్లో తరుచూ చెప్తుండేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరేసుకున్నాడు. ఎస్‌ఐ కామేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీ లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

నేలబావిలో పడి ఒకరు..

రాజాం, డిసెంబరు 25: పట్టణంలోని వస్త్రపురి కాలనీకి చెందిన దత్తి రామా రావు (46) అనే వ్యక్తి నేలబావిలో పడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. రామారావు గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని నేల బావి వద్ద అతడు రాసిన లేఖ, చెప్పులు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది, గజ ఈతగాళ్లు సంఘటనా స్థలానికి చేరుకొని బావిలో వెతికారు. రాత్రయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో శుక్రవారం ఉదయం మరోసారి బావి వద్దకు వెళ్లారు. నీటిని తోడించి మట్టిలో కూరుకుపోయిన రామారావు మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. బావి సమీపంలో లభ్యమైన ఉత్తరంలో  ‘నా చావుకు ఎవరితో ఎటువంటి సంబంధం లేదు’ అని రాసి ఉండడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.  


చలి మంటకాచుకుంటూ వృద్ధురాలి మృతి 

వంగర, డిసెంబరు 25: చలి కాచుకోవడానికి వేసిన మంట ఆమె ప్రాణాలు తీసింది. చీరకు నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.  స్థానికుల కథనం మేరకు... పటువర్థనం గ్రామానికి చెందిన అలుగోలు రాముడమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం తెల్లవారుజామున చలి మంట కాచుకుంటుండగా చీర కొంగుకు నిప్పంటుకుంది. ఒక్కసారి మంటలు వ్యాపించడంతో ఆమె కేకలు వేసింది. భర్త సూరయ్యతో పాటు ఇరుగుపొరుగువారు వచ్చి మంటలు ఆర్పేసి ఆమెను ఆటోలో రాజాం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండ డంతో అక్కడి నుంచి విశాఖ తీసుకెళ్లారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. 

  

Updated Date - 2020-12-26T05:52:19+05:30 IST