ఇంటి దీపం ఆరిపోయింది

ABN , First Publish Date - 2020-09-05T09:05:27+05:30 IST

ఆ ఇంటి దీపం ఆరిపోయింది. ముద్దులొలికే ఆ చిన్నారి నీళ్ల ట్యాంకులో విగతజీవిగా కనిపించింది...

ఇంటి దీపం ఆరిపోయింది

నీళ్ల ట్యాంకులో విగతజీవిగా 11 నెలల చిన్నారి

మృతిపై అనుమానాలు

పక్కింటివారు చంపేశారంటున్న తల్లి

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తురక శాసనాంలో విషాదం


(సోంపేట రూరల్‌, సెప్టెంబరు4)

ఆ ఇంటి దీపం ఆరిపోయింది. ముద్దులొలికే ఆ చిన్నారి నీళ్ల ట్యాంకులో విగతజీవిగా కనిపించింది. పక్కింట్లో ఆడుకుంటుందిలే అనుకున్న తన గారాల పట్టి.. చలనం లేకుండా కనిపించడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పక్కింటివారే తన బిడ్డను చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సోంపేట మండలం తురకశాసనాం గ్రామానికి చెందిన మూల దుర్యోధన, కావ్య దంపతుల కుమార్తె హేమశ్రీ(11 నెలలు) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దుర్యోధన ప్రస్తుతం ఉపాధి రీత్యా ముంబాయిలో ఉంటున్నాడు. చిన్నారితో కలిసి కావ్య తురకశాసనాంలో నివసిస్తోంది.


శుక్రవారం ఉదయం పక్కింటిలో నివసిస్తున్న వజ్జ నిర్మల.. మీ పాపను ఆడిస్తాను అని కావ్యకు చెప్పి హేమశ్రీని తన ఇంటికి తీసుకెళ్లింది. కాసేపటికే పాప కనిపించడం లేదంటూ కావ్యకు వచ్చి చెప్పింది. దీంతో అందరూ వీధిలో వెతికారు. ఇలా వెతుకుతున్న సమయంలో నిర్మల  వచ్చి తన ఇంటిపైన ఉన్న నీళ్ల ట్యాంకులో హేమశ్రీ పడి ఉందని కావ్యతో చెప్పింది. గ్రామస్థులు వెళ్లి చూడగా చిన్నారి విగతజీవిగా కనిపించింది. చిన్నారి మృతదేహాన్ని గ్రామస్థులు బయటకు తీశారు. బిడ్డను చూసి ఆ తల్లి ఒక్కసారిగా బోరుమంది. అయితే, బతికి ఉందేమోనన్న ఆశతో హేమశ్రీని సోంపేట కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం సీఐ వినోద్‌బాబు, బారువ ఎస్‌ఐ జి.నారాయణ స్వామి సంఘటన స్థలాన్ని సందర్శించారు. వివరాలు తెలుసుకున్నారు. ఇంట్లో చక్కగా ఆడుకుంటున్న తన కూతురిని పట్టుకెళ్లి చంపేశారని.. ఇది హత్యేనని తల్లి కావ్య ఆరోపిస్తుంది. ఆమె ఫిర్యాదు మేరకు హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  హేమశ్రీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


మృతిపై అనుమానాలు..

అప్పటి వరకు చక్కగా ఆడుకుంటున్న చిన్నారి.. ఒక్కసారిగా నీళ్ల ట్యాంకులో విగత జీవిగా మారడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంత చిన్నపిల్ల మేడ మీదకు వెళ్లి ట్యాంకులో పడిపోయి ఉండదని, ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-09-05T09:05:27+05:30 IST