బంగారు సూరీడు

ABN , First Publish Date - 2020-11-25T05:30:00+05:30 IST

కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని అరసవల్లి సూర్యనారాయణ స్వామి బంగారు ఆభరణాలతో ధగధగా మెరిసిపోయారు. పుష్కర కాలం తర్వాత స్వర్ణాలంకరణలో దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి తరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదిత్యుని దర్శించుకున్నారు.

బంగారు సూరీడు
బంగారు ఆభరణాల అలకరణలో ఆదిత్యుడు

 స్వర్ణాలంకరణలో దర్శనమిచ్చిన సూర్యభగవానుడు

 దర్శనానికి బారులు తీరిన భక్తులు

 గుజరాతీపేట, నవంబరు 25: కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని అరసవల్లి సూర్యనారాయణ స్వామి బంగారు ఆభరణాలతో ధగధగా మెరిసిపోయారు. పుష్కర కాలం తర్వాత స్వర్ణాలంకరణలో దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి తరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదిత్యుని దర్శించుకున్నారు. 2007లో స్వామి వారు బంగారు ఆభరణాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత భద్రతా కారణాల దృష్ట్యా మూలవిరాట్‌కు బంగారు ఆభరణాలను అలంకరించలేదు. ఎట్టకేలకు ఈ సారి ఆనవాయితీ ప్రకారం.. కార్తీక శుద్ధ ఏకాదశి,  క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాల సందర్భంగా 25, 26 తేదీల్లో పోలీసు బందోబస్తు నడుమ ఆదిత్యుడి మూలవిరాట్‌కి స్వర్ణాభరణాలను అలంకరించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం స్వామి మూలవిరాట్‌కు ఆభరణాలను తొడిగారు. ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు. ఎన్నో ఏళ్ల తరువాత ఇలాంటి మహాభాగ్యం కలగడంతో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. ఇక నుంచి ప్రత్యేక పర్వదినాల్లో ఆదిత్యునికి స్వర్ణాలంకరణ చేస్తామని ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర్‌శర్మ తెలిపారు. ప్రస్తుతం రెండు రోజుల పాటు బంగారు ఆభరణాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ అమిత్‌బర్దర్‌  ఆదేశాల మేరకు సీఐ అంబేద్కర్‌, ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌, రాములు, ఏఆర్‌ పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఆవరణలో 16 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. బంగారు ఆభరణాలతో ప్రతి నెల ఒకటి లేదా రెండో ఆదివారాల్లో భక్తులకు ఆదిత్యుని దర్శనం కల్పించనున్నట్లు ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు,  పాలక మండలి సభ్యులు యామిజాల గాయత్రి, పైడి భవాని, మండవిల్లి రవి, అంధవరపు రఘురామ్‌, మండల మన్మథరావులు ఆదిత్యుని దర్శించుకున్నారు. ఇంద్ర పుష్కరిణిలో గురువారం నిర్వహించనున్న తెప్పోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే ధర్మాన పరిశీలించారు. కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా కల్యాణానికి భక్తులను అనుమతించలేదు.  తెప్పోత్సవానికి కూడా భక్తులకు అనుమతి లేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. 

Read more